అనగనగా ఓ పెద్ద మనిషి. ఆయన తాను చెప్పిందే నిజమంటారు. తాను చేసిందే వేదమనుకుంటారు. ఎవరైనా నిజం చెప్పినా నమ్మరు. నిజమని తెలిసినా అంగీకరించరు. అలాంటి అలాంటి పెద్ద మనిషికి ఓ సారి కుందేలు దొరికింది. ఆ కుందేలుకు ఎన్ని కాళ్లా అని లెక్క పెట్టాడు. మూడే కనిపించాయి. తాను మూడు కాళ్ల కుందేలును పట్టుకున్నానని అందరికీ చెప్పుకోవడం ప్రారంభించాడు. అందర్నీ పిలిచి ఈ కుందేలు ఎన్ని కాళ్లున్నాయో చూపించి… లెక్కించి… వెళ్లమనేవాడు. అయితే చాలా మంది నాలుగో కాలు కూడా ఉంది మాస్టారూ.. అది కనిపించకుండా.. మీ గుప్పిట్లోనే పెట్టుకున్నారు.. ఓ సారి గుప్పిట విప్పండి అని చెప్పారు.్అయితే అలా చెప్పే వాళ్లని కసురుకున్నాడు. మీకు ఏం తెలియదు పొమ్మని చెప్పేవాడు. అయినా ఇతరుల దగ్గరకు వెళ్లడం మానలేదు. కాకపోతే విషయం తెలిసిన తర్వాత రూటు మార్చారు. అక్కడున్న వాళ్ళందర్నీ అడిగాడు “ మీకెన్ని కాళ్ళు కనిపిస్తున్నాయీ” అని. కనిపిస్తున్నవి మూడే ఎవరికైనా. ఆ తర్వాత ఎన్ని కాళ్ళున్నాయీ అని అడగలేదెవరినీ.నిపించని నాలుగో కాలు నీ చేతిలోనే వుందని ఎవరైనా చెబితే మాత్రం కోపం నషాళానికి అంటేది. ఎందుకంటే… ఆయన కుందేలుకు మూడే కాళ్లు ఉన్నాయని నమ్మారు.. తర్వాత అబద్దమని తెలిసినా తన సంగతి ఎక్కడ బయటపడుతుందోనని దబాయించడం ప్రారంభించారు. ఇక్కడ ఆ వ్యక్తి దారిన పోయే దానయ్య అయితే… అతని మూర్ఖత్వాన్ని చూసి జనం నవ్వుకుంటారు. చక్కా వెళ్లిపోతారు. కానీ అదే ఆయన రాజు అయితే.. ఆయన మూర్ఖత్వాన్ని భరించాల్సి ఎవరు ? అనుభవించాల్సింది ఎవరు ? ప్రజలే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడీ పరిస్థితి స్పష్టంగా అవగతమవుతోంది. అమరావతే రాజధాని .. అని అన్ని చోట్లా నుంచి స్పష్టంగా వినిపిస్తున్నా.. ఘనత వహించిన మహారాజు గారు మాత్రం.. తాను మూడు రాజధానులన్నాను కాబట్టి అది జరిగి తీరాల్సిందేనని పంతానికి పోతున్నారు. ఇది పంతం కాదు.. పిచ్చి అని చెప్పుకునే పరిస్థితులు కూడా కల్పిస్తున్నారు. రాజ్యాంగం లేదు.. చట్టంలేదు.. సుప్రీంకోర్టు లేదు… నేను పోతున్నానని మూటమూల్లె సర్దుకుంటున్నారు. ఇలాంటి రాజు ఉన్నందుకు.. ఎన్నుకున్నందుకు ఏపీ ప్రజలు ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి..?
మూడు రాజధానుపై ఏం జరిగిందో మొదటి నుంచి ఓ సారి రివ్యూ చేసుకుంటే పరిస్థితి తెలుస్తుంది !
అమరావతి రాజధాని పూర్తిగా చట్ట ప్రకారమే ఏర్పాటయింది.. అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. సుప్రీంకోర్టుకూ అఫిడవిట్ ద్వారా తెలిపింది. ఇంత కంటే క్లారిటీ ఇంక ఎక్కడా రాదేమో. అంటే.. మూడు రాజధానులు చట్ట విరుద్దమని ఎవరికైనా స్పష్టమవుతుంది. మరి ఈ మూడు రాజధానులు తెచ్చిన సీఎం కు తెలియదా అంటే… తెలియకుండా ఎలా ఉంటుంది..? కానీ మనం ముందే చెప్పుకున్నట్లుగా నేను ఎంచుకున్న రాజ్యానికి మూడు రాజధానులు అని ఆయన ఫిక్స్ అయిపోయారు. అందుకే.. ఎలాగైనా సరే అదే చెప్పించాలని ఆయన పట్టు వదలకుండా ప్రజాధనంతో… న్యాయవ్యవస్థ మీద దండయాత్ర చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఈ నెల ఇరవై మూాడో తేదీన అమరావతి కేసు విచారణకు రానుంది.ఈ కేసులో కేంద్రం చెప్పాల్సింది చెప్పింది. హైకోర్టు కూడా మూడు రాజధానులు చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. కానీ ఇదంతా వదిలేసి .. చట్టాలు చేసుకునే అధికారం లేదని ఏపీ హైకోర్టు చెప్పిందని.. అందుకే ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని వాదిస్తోంది. స్టే ఇస్తే.. వెంటనే మూడు రాజధానుల బిల్లు పెట్టాలని ప్రయత్నం. కానీ ఆ మూడు రాజధానుల బిల్లు న్యాయం ముందు తేలిపోతుందన్న కారణంతోనే కదా మళ్లీ వెనక్కి తీసుకుంది. ఈ నిజాన్ని అంగీకరించడానికి ఈ మూడు రాజధానుల మహారాజు సిద్ధంగా ఉండరు. ఆయన లోకం ఆయనది.
అమరావతికే మద్దతని చేసిన విన్యాసాలు గుర్తొకొస్తే తల ఎక్కడ పెట్టుకుంటారు ?
పోనీ ఈ మూడు రాజధానుల మహారాజు ముందు నుంచీ మూడు రాజధానులే తన విధానం అని గట్టిగా నిలబడ్డారా అంటే.. .. ఈ విషయంలో ఆయన విశ్వసనీయత చెప్పుకుంటే చరిత్ర.. రాసుకుంటే పుస్తకం అవుతుంది. మీరు అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తారా అని ఎన్నికల సమయం మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. ఇదిగో అమరావతిలో రెండున్నర ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నా.. చంద్రబాబే ఇల్లు కట్టుకోలేదని… వాదించారు. పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడతామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ తో ప్రకటింప చేశారు. గృహప్రవేశానికి వచ్చిన వందిమాగధులందరితో.. అమరావతే మన రాజధాని.. చంద్రబాబుకు కట్టడం చేత కాలేదు నేను కట్టి చూపిస్తానని సవాల్ చేయించారు. ఇంతా చేసి ఆయన ఇప్పుడేమంటున్నారు.. పోదాం పదండి విశాఖకు..నేను కూడా విశాఖ వస్తున్నా అని చెబుతున్నారు. ఇంత కంటే విశ్వాస ఘాతుకం… ప్రజలకు చేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా ? చరిత్రలో ఎవరూ ఉండరు… ఇక ముందు రారు.. ఒక్కరే ఒక్క మూడు రాజధానుల మహారాజు మాత్రమే ఉంటారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. కనీసం ఓ కార్యాలయాన్ని కూడా తరలించలేకపోయారు. అన్ని చోట్లా ఎదురు దెబ్బలే తిన్నారు. సుప్రీంకోర్టులో గెలిచేసి.. ఇక మూడు రాజదానులకు మహారాజు అయిపోదామని ఆశ పడుతున్నారు.
ప్రజలకు, రాష్ట్రానికి చేసిన నమ్మకద్రోహం వదిలి పెడుతుందా ?
అసలు ప్రజలకు ఇంత నమ్మకం ద్రోహం చేసిన దానికి చింతించాల్సింది పోయి… అన్ని రకాల రాజ్యాంగ వ్యవస్థలు కూడా అమరావతిని సమర్థించినప్పటికీ తాను వెళ్లిపోతానని వితండవాదం చేస్తున్నారంటే ఏమనుకోవాలి ? సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినా రాకపోయినా.. విశాక కేపిటల్ అని మూడు రాజధానుల మహారాజు వంది మాగధులకు చెప్పేశారు. ఉద్యోగులకు జీతాలివ్వకపోయినా కనీస చింత లేకుండా విశాఖలో భవనాలు వెదుక్కుంటున్నారు. ఐటీ కంపెనీలను ఖాళీ చేయించి అయినా సరే భవనాలు రెడీ చేసుకుంటున్నారు. ఇది కదా అసలు రెటమతం అంటే. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు సమర్ధిస్తే.. జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో ఎప్పటికీ మూడు రాజధానులు చేయలేరు. కనీసం విశాఖ కు మారేరు. ఆయన అక్కడ క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకుంటే..ఆయన అడ్రస్ మారుతుంది కానీ రాజధాని మారదు. నిజంగా.. అసలు రాజ్యాంగంలో రాజధాని అన్న పదమే లేదని.. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని ప్రకటించుకునే పని అయితే..అసలు అసెంబ్లీలో చట్టాలు ఎందుకు చేశారు.. ఎందుకు ఉపసంహరించుకున్నారు.. మళ్లీ అసెంబ్లీలో బిల్లు పెడతాం అని ఎందుకంటున్నారు.. హైకోర్టు కాదు.. సుప్రీంకోర్టు వరకూ ఎందుకు పరుగులు పెడుతున్నారు ?. ఇప్పుడు ఎక్కడా అనుకూలమైన నిర్ణయం రాదని.. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని ఎందుకు వాదిస్తున్నారు ?. అన్ని వ్యవస్థలను కాదని ఆయన విశాఖ వెళ్లి ప్రజాధనాన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్‌లు…బీచ్ వ్యూతో ఇళ్లూ కట్టుకోవచ్చు కానీ..రాజధానిని మార్చలేరు. కానీ ప్రజల్ని.. రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేసిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు.
ప్రధాని మోదీ కన్నా ఎక్కువ అనుకుంటున్నారా ?
రాజకీయాల్లో అహం.. అసలు పనికి రాదు. ఎందుకంటే అధికారం అనేది ప్రజలు ఇస్తే వచ్చింది. తాను కసరత్తు చేయడం ద్వారానో.. కవచ కుండలాలతో పుట్టడం ద్వారానో.. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి పుట్టడం వల్లనో రాలేదు… రాదు కూడా. ప్రజల వైపు నుంచే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఓ ఎగ్జాంపుల్. రైతు చట్టాల విషయంలో ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేకతను గుర్తించారు. నిజానికి రైతు చట్టాల విశ్లేషణలో నిపుణలు కూడా వాటి వల్ల రైతులకు మేలేనన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఒక్క పంజాబ్ రాష్ట్ర రైతులే తీవ్రంగా వ్యతిరేకించారు. పంజాబ్ లో బీజేపీ బలం దాదాపుగా లేదు. అయినప్పటికీ రైతులు పట్టుదలగా చేస్తున్న ఉద్యమానికి తలొంచారు. దానికి కారణం ప్రజల భయమే. ప్రజలు ఎక్కడ వ్యతిరేకంగా ఓటు వేస్తే.. తన సీటు కిందకు నీళ్లు వస్తాయన్న భయంతోనే ఆయన చట్టాలను వెనక్కి తీసుకున్నారు. అంతే కానీ చట్టాలు రైతులకు నష్టం చేస్తాయని అంగీకిరంచి వెనక్కి తీసుకోలేదు. కానీ తాను ప్రధానమంత్రినని.. తిరుగులేని పవర్ ఫుల్ స్థానంలో ఉన్నానని ఇప్పటికీ.. తనకు ఎదురు వచ్చే నేత లేడని ఆయన విర్రవీగలేదు. ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మూడు రాజధానుల మహారాజు గారు.. ప్రధాని మోదీ కన్నా బలవంంతుడని అనుకుంటున్నారా ? చట్టాలను.. పార్లమెంట్‌ను..రాజ్యాంగాన్ని చివరికి సుప్రీంకోర్టును కూడా ధిక్కరించి తాను ఏదనుకుంటే అది చేయగలనని నిరూపించాలని అనుకుంటున్నారా ? రాజకీయాల్లో ఇంత కంటే తెలివి తక్కువ అడుగులు.. నిర్ణయాలు ఉంటాయా ?
రాజకీయాల్లో ఈగోకి అంతిమ ఫలితం ఓటమే !
రాజకీయాల్లో ఎవరైనా పట్టుదలకు పోతే అంతిమ ఫలితం ఓటమే అవుతుంది. ఆ విషయంలో ఒక్క శాతం కూడా మార్పు ఉండదు. ఎందుకంటే.. మనమే ఇందిరా గాంధీ సహా ఎంతో మందిని చూశాం. కానీ అసలు దరిద్రం ఏమిటంటే.. ఎంత మందిని చూసినా రాజకీయాల్లోకి వచ్చే కొంత మంది.. అధికారం దక్కగానే తమకు అధికారం శాశ్వతమని.. ప్రజలను ఎలాగైనా మోసం చేయవచ్చనని.. ఎన్ని మాటలైనా మార్చవచ్చుని నిరూపిస్తూ ఉంటారు. ఈ మాటలు మార్పులు.. ప్రజల జీవితాల్ని ప్రభావితం చేయనంత వరకూ ఓకే కానీ.. రాష్ట్రాన్ని .. రాష్ట్ర ప్రజల భవిష్యత్ నూ పణంగా పెట్టేలా ఉంటే మాత్రం ఆ రాజకీయ నేత భవిష్యత్ అంతటితో అయిపోతుంది. ఇందులో మినహాయంపులు ఏమీ ఉండవు.
ఇక్కడ మనం ఓ గాడిద కథను గుర్తు చేసుకుందాం.. గాడిదను మేపడానికి కొండపైకి తీసుకెళ్లిన ఓ వ్యక్తి సాయంత్రం కిందకు దింపుతున్నాడు. దారిలో కొండ చుట్టూ నడుస్తూంటే.. మా యజమానికి ఏమీ తెలీదు – ఇంత సేపటినుంచి తోల్తున్నాడు కాని ఇంటి వైపుకి కాకుండా ఈ కొండా చుట్టూరా నడుస్తున్నాము. అనుకుంది గాడిద. ఒక్క గెంతు వేస్తె ఆ కొండ దిగిపోతాము కదా!” అనుకుంది. యజమాని నుంచి విడిపించుకుని ఒక్క సారిగా దూకేసింది. అలా గెంతగానే తాను ఇంటి దగ్గరకు వెళ్తానని అనుకుంది..కానీ ఎక్కడికి వెళ్లిందో చెప్పాల్సిన పని లేదు. దీన్ని బట్టి నీతి ఏమంటే.. మన చుట్టూ చూసుకోవాలి.. మంచీ చెడూ విశ్లేషించుకోవాలి.. ఆ తర్వాతే ముందుకెళ్లాలి.. తాను అనుకున్నదే జరిగి తీరాల్సిందని మొండికెస్తే గాడిద పరిస్థితే అవుతుంది. ఇది వాళ్లకీ వీళ్లకీ కాదు.. అందరికీ వర్తిస్తుంది. మారు మనసు పొందితేనే తదుపరి అడుగులు .