తెలంగాణ కొత్త సచివాలయాన్ని కేసీఆర్ పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించాలని అనుకున్నారు. అది కూడా ఓ నేషనల్ ఈవెంట్ లా నిర్వహించాలనుకున్నారు. తెలంగాణలో గ్రామ గ్రామాన సంబురాలు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నేతల్నీ పిలిచారు. కానీ చివరికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నికల కోడ్‌కు … సచివాలయ ప్రారంభానికి సంబంధం ఏమిటో ఎవరూ చెప్పలేరు. ఎన్నికలు జరుగుతోంది రెండు ఎమ్మెల్సీ స్థానాలకు .ఒకటి టీచర్ల ఎమ్మెల్సీ.. ఇంకోటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. ఈ రెండిటికి ఓటర్లు పరిమితం. ఇలాంటి ఎన్నికలకు సచివాలయం ఓపెనింగ్ కార్యక్రమాలు చేయకూడదని ఈసీ ఎప్పుడూ అభ్యంతరం చెప్పదు. అయితే అసలు ఎలాంటి అనుమతులు అడగకుండానే ప్రారంభోత్సవాన్ని రద్దు చేసుకున్నారు. సచివాలయం ప్రారంభోత్సవం రద్దు కావడంతో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలనుకున్న సభ కూడా వాయిదా పడినట్లేనని భావిస్తున్నారు.
అసలు కారణం ఎన్నికల కోడ్ కాదని.. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. సీఎం చాంబర్ ఉండే ఐదు, ఆరు అంతస్తుల్లోనే అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ఎలాంటి కేసులు పెట్టలేదు. ఎలాంటి వివరాలూ బయటకు రానివ్వలేదు. ఎంత డ్యామేజ్ అయిందో తెలియదు. కానీ సచివాలయం ప్రారంభం అవుతుందనే ప్రచారం చేశారు. చివరికి వాయిదా వేయడంతో అగ్నిప్రమాద నష్టం తీవ్రంగానే ఉండి ఉంటుదని అందుకే వాయిదా వేశారని అనుమానిస్తున్నారు.