వివేకా హత్యకేసు హైదరాబాద్ కు మారిన తర్వాత సీబీఐ తీరు కూడా మారిపోయింట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ పులివెందుల కోర్టులో వేసిన చార్జిషీట్లను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలించారు. దర్యాప్తులో ఇంకా అనేక విషయాలు తెలుసుకున్నామని … అదనపు వివరాలతో మరో అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. అంటే… సీబీఐ ఇప్పటి వరకూ కేవలం పాత్రధారుల్నే నిందితులుగా చూపిస్తూ వస్తోంది. అదనపు చార్జిషీటులో అసలు సూత్రధారుల్ని కనిపెట్టి వారి గురించి బయట పెట్టే అవకాశం ఉంది. నిందితులుగా చేర్చే అవకాశం ఉంది.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి ఓ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నించినా సీబీఐ అధికారులు పట్టుదలగా కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. మొదట్లో సీబీఐ తీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చినా తర్వాత మెల్లగా అయినా ముందుకు కదులుతున్నారు. ఇప్పుడు అసలు విచారణ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ ఓఎస్డీ, భారతి అటెండర్ నవీన్ లను సీబీఐ విచారించిన తర్వాత… కొంత మందికి నోటీసులు చేస్తారని చెబుతున్నారు.
కాల్ రికార్డులు వివేకా హత్య కేసులో కీలకమయ్యాయి. తెల్లవారుజామున మూడు గంటల నుంచే కాల్స్ ప్రారంభమయ్యాయి. ఆ కాల్స్ విశ్లేషణ.. తర్వాత మాట్లాడిన వారు మీడియా ముందు అమాయకత్వం చూపించడం… అలాగే… సాక్ష్యాలు మాయం చేయడం ఇలా అనేక అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అసలు హత్య.. కారణాలు.. ఇలా మొత్తం డొంక కదిలేలా..తీగను సీబీఐ అధికారులు పట్టుకున్నారని అంటున్నారు. అదే జరిగితే కొత్త చార్జిషీట్లో ఏ -1, ఏ – 2లుగా కొత్త వారు చేరడం ఖాయంగా కనిపిస్తోందని ఈ పరిణామాలను విశ్లేషిస్తున్న వారు అంచనా వేస్తున్నారు.