మరణించిన వ్యక్తులు, ప్రముఖుల పేరుతో వారి అభిమానులు, వారసలు, ఆప్తులు రాజకీయ పార్టీలు పెట్టుకుని… వారి పేరుకు ఉన్న జనాభిమానాన్ని సొమ్ముచేసుకోవడానికి ప్రయత్నించడం అనేది మన దేశంలో కొత్త విషయం ఎంతమాత్రమూ కాదు. అయితే తాను జీవించినంత కాలమూ ఎలాంటి రాజకీయ కళంకమూ అంటకుండా.. రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలోనే అత్యున్నత స్థానాన్ని అలంకరించి, ఆ పదవికే వన్నె తెచ్చిన నాయకుడి విషయంలో కూడా ఇలాంటి పార్టీ ఒకటి ఆవిర్భ వించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. తమిళనాడులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ఓ రాజకీయ పార్టీ ఆవిర్బవించడం చర్చనీయాంశంగా ఉంది.
తమిళనాడులో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు అక్కడ యాక్టివేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కలాం పేరిట ఓ కొత్త పార్టీ కూడా పుట్టింది. ‘అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ’ పేరుతో ఇది ఏర్పాటు కావడం విశేషం. కలాంతో కలిసి 20 ఏళ్లపాటు పనిచేసిన ఆయన శాస్త్ర సలహాదారు పొన్రాజ్ ఈ పార్టీ పెట్టారు. పార్టీ ప్రారంభం గురించి కలాం సమాధి వద్దనే ప్రకటించారు. అవినీతి లేని ప్రభుత్వాన్ని తేవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
అయితే అబ్దుల్‌కలాం జీవితం మొత్తం ఎలాంటి రాజకీయ పార్టీ ల రంగు రుచి వాసన అంటకుండా గడిపారు. అలాంటి తటస్థ వ్యక్తిత్వంతోనూ ఆయన రాష్ట్రపతి పదవిని అధిష్ఠించారంటే.. అది ఆయన ఔన్నత్యమే తప్ప మరొకటి కాదు. ఆయన పేరుతో ఇప్పుడు పార్టీ రావడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కలాం పేరును రాజకీయాలకు వాడుకోడాన్ని ఆయన కుటుంబసభ్యులు కూడా ఖండిస్తున్నారు. కాకపోతే.. దానికి వ్యతిరేకంగా కేసు పెట్టి పోరాడడం మీద వారికి ఆసక్తి లేదు. పార్టీ రహితంగా దేశవ్యాప్తంగా ఉండే కలాం అభిమానుల్లో కూడా.. అంతటి మహనీయుడి పేరిట పార్టీ రావడం పట్ల అసంతృప్తి వెల్లువలాగా కనిపిస్తోంది. పొన్రాజ్ స్థాపించిన పార్టీ.. ఎన్నికల్లో ఎలాంటి విజయాలు నమోదుచేస్తుందో గానీ.. కలాం పేరుతో పార్టీ పెట్టి విమర్శల్ని మూటగట్టుకుంటోంది.