ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను బదిలీ చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. దీనికి కారణం అసలు ఆయన బదిలీపై ఎలాంటి ప్రచారం జరగలేదు. చాన్నాళ్ల క్రితం ఇతరుల పేర్లు పరిశీలనకు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది కానీ అదంతా ఉత్త ప్రచారమే. ఇప్పుడు అలాంటి ప్రచారమే లేకుండా నేరుగా బదిలీ చేసి కొత్త గవర్నర్ ను నియమించారు. ఒక వేళ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ కు గవర్నర్ గిరీ ఇవ్వాలనుకుంటే.. చత్తీస్ ఘడ్కే నియమించి వచ్చు కదా.. ఏపీ నుంచి భిశ్వభూషణ్ ను బదిలీ చేసి మరీ ఆయనకు ఏపీలోనే ఎందుకు చోటు కేటాయించారు అన్నది అసలు టాపిక్ గా మారింది.
ఈ విషయంలో అటు వైసీపీ కానీ.. ఇటు టీడీపీ కానీ ఈ నియామకంపై ఎలాంటి హర్షం కానీ వ్యతిరేకత కానీ వ్యక్తం చేయలేని పరిస్థితి. ఎందుకంటే. .. అసలు ఈ నియామకం ఉన్న వెనుక మోటో ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో గవర్నర్ ను మార్చడం అనూహ్య పరిణామమే. కానీ ఇది ఎవరికి అనుకూలంగా చేసిన నియామకం అన్నది మాత్రం అంతు చిక్కడం లేదు. ఏపీలో బీజేపీ ఉనికి లేదు. తెలంగాణ గవర్నర్ చేసినట్లుగా చేస్తే బీజేపీకి వచ్చే లాభమేమీ ఉండదు. మరి ఎందుకు హఠాత్తుగా ఈ మార్పు ?
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వెంటనే అబ్దుల్ నజీర్ ను గవర్నర్ గా నియమించడం అనేక విమర్శలకు కారణం అవుతోంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా కేంద్రం చర్యలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇలా పదవి విరమణ చేసిన వెంటనే కేంద్రం నుంచి లబ్ది పొందిన ఇతర న్యాయమూర్తులను గవర్నర్లుగా నియమించడం ఇదే ప్రథమం కాదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కేరళ గవర్నర్ గా సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజే సదాశివంను నిర్ణయించారు. ఆ తర్వాత రంజన్ గొగోయ్ కు రాజ్యసభ ఇచ్చారు. ఇతర న్యాయమూర్తులూ రిటైర్ కాగానే పదవులు పొందారు.
ఏపీ గవర్నర్ మార్పు వెనుక మోటో ఉందా లేదా అన్నది ఆయన వ్యవహశైలి బట్టి తెలిసిపోవచ్చు. దానికి ఒకటి, రెండు నెలల సమయం సరిపోతుంది.