పోలవరం వంటి ప్రాజెక్టులు గంట, అరగంటలో కట్టడం కుదరదంటున్నారు మంత్రి అంబటి. పోలవరం ప్రాజెక్టు చాలా జాగ్రత్తగా కట్టాలని అందుకే చాలా సమయం అవసరమని చెబుతున్నారు. గతంలో ఫలానా తేదీకి పూర్తి చేస్తామని చేసిన చాలెంజ్‌ల సంగతి ఏమయిందో మాత్రం ఘనత వహించిన మంత్రులు చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టును 2021కి పూర్తి చేస్తామని అసెంబ్లీలో గత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. కనీసం పనుల్లో పురోగతి లేకుండానే ఆయన పదవి ఊడిపోయింది. ఇప్పుడు అంబటి వచ్చారు. ఆయన చేస్తున్న నిర్వాకాలు… ఇస్తున్న ప్రకటనలు విన్న వారికి ఎవరికైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదనే అభిప్రాయం ఏర్పడుతుంది.
పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అది దశాబ్దాల కల, ఎలాగోలా పూర్తి చేద్దామనుకుని శరవేగంగా నాలుగేళ్ల పాటు పనులు జరిగాయి. ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా పడకేసింది. కేంద్రం వద్దంటున్నా కాంట్రాక్టర్ ను మార్చేశారు. ఇప్పటి వరకూ పనులు జరుగుతున్న దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు ఏదో ఓ సాకు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని దాన్ని బాగు చేయాలని కథలు చెబుతున్నారు. అసలు పనులు నిలిపివేయడం వల్లనే ఈ సమస్య వచ్చిందని నిపుణులు చెబుతూంటే… గత ప్రభుత్వం మీద రాళ్లేసి తప్పించుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ తప్పు ఎవరు చేశారన్న పంచాయతీ రాజకీయాలకు అవసరమేమో కానీ రాష్ట్రానికి మాత్రం పోలవరం పూర్తి కావడం ముఖ్యం.
ఏపీ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసింది. దశాబ్దాల కరువును లేకుండా చేసే జీవనాడి ప్రాజెక్టుల్ని నేలమట్టం చేస్తున్నారు. అద్భుతమైన రాజధానిపై కుట్రలు పన్నుతున్నారు. చివరికి చేతులెత్తేసి మేమేమీ చేయలేమంటున్నారు. ఇంత దారుణమైన పరిపాలనను గతంలో ఏ ప్రభుత్వమూ చేసి ఉండలేదని జనం అనుకుంటూంటే.. వారికి పథకాల పేరుతో కొంత డబ్బు ఇస్తున్నామని చెప్పి… నయవంచన చేస్తున్నారు పాలకులు.