ఓ జిల్లాకు పేరు పెట్టాలంటే ఎక్కడ డిమాండ్ చేయాలి… ఆ రాష్ట్రంలో డిమాండ్ చేయాలి .. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి లేకపోతే విజ్ఞప్తి చేయాలి. అంతకు మించి చేయాలంటే.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించాలి.. అలాంటివేమీ చేయకుండా నేరుగా పార్లమెంట్లో ప్రస్తావిస్తే.. అలాంటి నేతల్ని ఏమనాలి ? . ఏమనాలో ఎవరికి వారు డిసైడ్ చేసుకుని ఆ మాటను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గురించి అనుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన చేసింది ఇదే.
సమయం.. సందర్భం లేకుండా రాజ్యసభలో వంగివీటి మోహనరంగా గురించి ప్రస్తావించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. . వంగవీటి మోహనరంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందిన నేత, కృష్ణా లేదా మచిలీపట్నం జిల్లాలకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జీరో అవర్లో ముందుగా నోటీసు ఇవ్వకుండా ఏ విషయమైనా మాట్లాడవచ్చు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని జీవీఎల్ ఈ కామెంట్లు చేశారు. ఇంత చేసిన ఆయన .. జిల్లాల విభజన అప్పుడు.. లేకపోతే పేర్లు పెట్టినప్పుడు ఏమైనా రంగా పేరు పెట్టాలని ఏపీలో డిమాండ్ చేశారా.. ఉద్యమాలు చేశారా అంటే అదేమీ లేదు.. ఆయన పార్టీ బీజేపీ ఏమైనా చేసిందా అంటే అదీ లేదు. అప్పుడు సైలెంట్ గా ఉండి…. ఇప్పుడు పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నారు జీవీఎల్.
ఇటీవల ఆయన కాపు సామాజికవర్గంపై దృష్టి పెట్టారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు చెల్లుతాయి అని రాజ్యసభలో ప్రశ్న అడిగి చెప్పించిన తర్వాత ఆయన కాపులతో రాజకీయం ప్రారంభించారు. కాపు సంఘాలతో సన్మానాలు చేయించుకుంటున్నారు. దీనిపై కన్నా లక్ష్మినారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవీఎల్ కాపులను ఉద్దరించినట్లుగా కలరింగిస్తూ సన్మానాలు చేయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అలా ప్రశ్నించగానే ఇలా రంగా విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు జీవీఎల్. మొత్తానికి కాపులు … రంగా పేరు చెప్పగానే తన వెనుక వచ్చేస్తారని.. సన్మానాలు చేసేస్తారని జీవీఎల్ ఆశేమో కానీ.. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి.