మీరు ప్రజల్లో కష్టపడండి.. నేను ఎన్ని ఇబ్బందులు పడినా బటన్లు నొక్కుతున్నారు. ఈ విషయాన్ని ప్రజల దగ్గరకు చేర్చండి అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టినా చెబుతూంటారు. కానీ సోమవారం జరిగిన సమావేశంలో బటన్ల గురించి చెప్పలేదు. అదే సమయంలో నొక్కాల్సిన బటన్ల ఎప్పటికప్పుడు పెండింగ్లో పడిపోతున్నాయి. వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఆసరా పథకం కింద… కోటి మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయాల్సి ఉంది. రూ. యాభై వేల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. నాలుగేళ్లపాటు రూ. 12500 ఇస్తామని చెప్పారు.
సంక్షేమ క్యాలెండ్లో ఆసరా బటన్ నొక్కని సీఎం జగన్
2022 మార్చిలో ప్రభుత్వం విడుదల చేసిన పథకాల బటన్లు నొక్కే క్యాలెండర్లో ఆసరా పథకం జనవరిలో ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది. కానీ నొక్కలేదు. హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి వచ్చాక ఇప్పటికి రెండు సార్లు జనవరిలో ఇచ్చారు. కానీ డ్వాక్రా మహిళల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా రూ. 12500 రాలేదు. ఏవో కారణాలు.. నిబంధనలు పెట్టి.. రూ. ఐదారు వేలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత రుణమాఫీని చేయలేకపోతున్నారు. అసలు ఇస్తామన్న దాంట్లో కనీసం ఇరవై శాతం కూడా ఇవ్వకపోగా… డ్వాక్రా సంఘాల నిధులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
పెరిగిపోతున్న బటన్లు నొక్కని పథకాలు
ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చయ్యే పథకాల్లో ఆసరా ఒకటి. కనీసం రూ. ఆరు వేల కోట్లు కావాలి. ఏపీ ప్రభుత్వం పథకాల లబ్దిదారులను పూర్తిగా తగ్గించేసి.. ఓ వంద, రెండు వందల మందికి కూడా పథకాలు ఇచ్చి అమలు చేసేశామని ప్రకటనలు ఇస్తోంది. కానీ ఇప్పుడు అలా కూడా బటన్లు నొక్కలేకపోతున్నారు. డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలకు బటన్లు నొక్కాలి. కానీ ఇప్పటి వరకూ వాటి గురించి ఆలోచనే లేదు. జనవరిలో ఆసరా పథకం .. ఈ నెల విద్యా దీవెన పథకం నిధులకు బటన్ నొక్కాలి. దీనిపై సమాచారం లేదు. విద్యా దీవెన పేరుతో ఫీజు రీఎంబర్స్ మెంట్ వ్యవహారాన్ని గందరగోళం చేసుకున్నారు. ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు తిప్పలు పడుతున్నారు.
జీతాలకే బటన్లు నొక్కలేని దుస్థితి !
జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే బటన్లు నొక్కలేని ఆర్థిక పరిస్థితికి ఏపీ చేరుకుంది. అదనపు రుణాల కోసం ఢిల్లీలో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ రాకపోతే వచ్చే నెలలో ఇంకా తీవ్రమైన కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారు. పరిస్థితి చూస్తూంటే… నాలుగేళ్లకే బటన్ల సినిమా క్లైమాక్స్ కు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.