వడ్డీరేటు తక్కువగా ఉంది కదా అని ఇళ్లు కొనుక్కున్న వారిని దివాలా అంచుకు చేర్చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ద్రవ్యోల్బణం కట్టడి పేరుతో వరుసగా రెపో రేట్లు పెంచుకుంటూ పోయారు. మొత్తంగా ఆరు సార్లు పెంచారు. ప్రతీ రెండు నెలలకోసారి రుణాలపై వడ్డీరేట్లు పెంచుకుంటూ పోయారు. ఆరు.. ఏడు మధ్య ఉండే వడ్డీ రేటు ఇప్పుడు తొమ్మిదిన్నర.. పదిన్నర మధ్య కదలాడుతోంది. ఇది సరిపోక.. ఇంకా పెంచుతామనే బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఈ కారణంగా ఓ మాదిరి రుణం తీసుకున్న వారు కూడా లక్షల్లో అదనంగా కట్టాల్సి వస్తోంది.
కరోనా తర్వాత సొంత ఇళ్లు ఉండాలని ఆవేశపడిన వారందరికీ ఇప్పుడు ఏడుపు ఒక్కటే తక్కువ. కరోనా సమయంలో కనీవినీ ఎరుగనంత తక్కువ వడ్డీరేట్లు ఉన్నాయంటూ ఊదరగొట్టి జనాలను ఇళ్ల వైపు నడిపించారు. ఈఎంఐలు తక్కువే పడుతాయి కదా అని ఎక్కువ మంది రిస్క్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు అటు టెర్నర్ పెరిగిపోయింది.. ఇటు ఈఎంఐ కూడా భరించలేనంతగా పెరిగింది. నెలంతా కష్టపడి అందుకున్న సంపాదనలో పెద్ద మొత్తం రుణదాతలకే ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందిప్పుడు. వాహన, విద్య, వ్యక్తిగత రుణాలపైనా ఈ వడ్డీ భారం ఎక్కువగానే ఉంది.
సాధారణంగా 20 ఏండ్లు, అంతకంటే తక్కువ కాలపరిమితి ఉన్న గృహ రుణగ్రహీతలకు నెలనెలా చెల్లించే ఈఎంఐ భారంలో ఎలాంటి మార్పూ కనిపించకపోవచ్చు. 30 ఏండ్లకు మించి ఈఎంఐ చెల్లింపుల కాలపరిమితి పెంచే మార్గం లేనప్పుడు ఈఎంఐ విలువను ఎప్పటికప్పుడు పెంచుతున్నాయి బ్యాంకులు. కానీ టెర్నర్ పెంచినా నెల ఈఎంఐలో వడ్డీ భారమే ఎక్కువగా కనిపిస్తోంది.
ద్రవ్యోల్బణం తగ్గించాలంటే.. ఎప్పుడో ఖర్చు పెట్టి కొనుక్కున్న వాటి మీద వడ్డీరేట్లు పెంచడం ఎందుకన్నది ఆర్థిక నిపుణులకే అంతుబట్టడం లేదు. కొత్తగా ఇచ్చే రుణాలకు మాత్రమే అది వర్తింప చేస్తే కొంటే కొంటారు లేకపోతే లేదు.. కానీ ఎప్పుడో ఖర్చు పెట్టేసిన దానికి ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచడం మధ్యతరగతి ప్రజలపై గుదిబండే. పన్నుల మీద పన్నులు కడుతున్న వారు.. .. ఇప్పుడీ వడ్డీ బాదుడుతో.. ప్రధాని మోదీకి మరింత ఫ్యాన్స్ గా మారే చాన్సులు ఎక్కువగా ఉన్నాయి.