బడ్జెట్ కేటాయింపుల్లో అనాధలా ఏర్పడిన కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చాలా అన్యాయం జరిగిందనే విషయంలో ఎవ్వరికీ భిన్నాభిప్రాయం లేదు. ఈ విషయంలో కేంద్రానికి మిత్రపక్షమే అయినా అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు. అయితే దారుణం ఏంటంటే.. వీరి అసంతృప్తితో ఏం ఒరుగుతుంది? వీరు కేంద్రంనుంచి చేతనైతే ఏమైనా సాధించాలి గానీ.. అసంతృప్తి వెలిబుచ్చడం వలన రాష్ట్రానికి లాభం ఏంటి? అని అనిపిస్తుంది.
కానీ చంద్రబాబునాయుడు మంగళవారం నాడు తన పార్టీ పాలిట్‌బ్యూరో సమావేశంలో మరో ట్విస్టు కూడా ఇచ్చారు. బడ్జెట్లో మన రాష్ట్రానికి అన్యాయం జరిగిన తర్వాత.. చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీతో మాట్లాడారుట. బడ్జెట్లో నిధులు రాష్ట్రాల వారీగా కాకుండా, రంగాల వారీగా కేటాయించినట్లు జైట్లీ చెప్పారుట. పెండింగు ప్రాజెక్టుల మీద ఈ ఏడాదే స్పష్టత ఇస్తాం అని కూడా చెప్పారుట. ఆ మాటలు విని చంద్రబాబు ఊరుకున్నట్లుగా ఉంది.
బడ్జెట్లో ఎక్కడైనా రంగాల వారీగానే నిధులు కేటాయించడం నిజమే కావొచ్చు. కానీ అగ్రప్రాధాన్య రంగంగా సేద్యానికి, నీటిపారుదలకు కేటాయింపులు జరిపినప్పుడు జాతీయ ప్రాజెక్టు పోలవరానికి ముష్టి విదిలించినట్లుగా 100 కోట్లు ఇవ్వడం ఏమిటి? దీని గురించి జైట్లీతో ఫోను సంభాషణలో చంద్రబాబు అడిగారా? లేక, ఆయన చెప్పిన సమాధానానికి సంతృప్తి పడిపోయి ఊరుకున్నారా అనేది మీమాంస.
‘కేంద్రంతో పోరాడి లాభం లేదు’ అనే ఆత్మవంచనతో కూడిన మాటలు వల్లిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మనకు జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేయకుండా, జైట్లీ చెప్పింది వినడానికి చంద్రబాబు ఫోను చేసి ఉపయోగం ఏంటి? ఈ మెతక వైఖరి రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నదని పలువురు భావిస్తున్నారు.