అమరావతికే రాజధాని అని ఓట్లేయించుకున్నారు… తర్వాత దక్షిణాఫ్రికాలో మూడున్నాయని ఏపీలోనూ మూడు రాజధానులు కావాలని ప్రజలంటున్నారని మూడు రాజధానులన్నారని… ఇప్పుడు విశాఖే రాజధాని అని చెప్పుకొస్తున్నారు. ఓ వైపు మూడు రాజధానుల బిల్లు పెడతామని రంకెలు వేస్తూ ఉంటారు. మరో వైపు ఇన్వెస్టర్ల దగ్గరకు వెళ్లి … అసలు మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్ అని పత్తిత్తు కబుర్లు చెబుతారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి రాజధాని అంశంపై అడ్డగోలు వాదనలు చేస్తూంటారు. అసలు ఈ ప్రభుత్వానికి ఓ విధానం అంటూ ఉందా అని ఎవరైనా ఆశ్చర్యపోతే అది వారి తప్పు కాదు. కాని వారి విధానం అవసరానికి తగ్గట్లుగా నమ్మింంచి మోసం చేయడమే ప్రభుత్వ విధానంగా కనిపిస్తోంది.
ఏపీలో మూడురాజదానులకు కట్టుబడి ఉన్నామని ప్రజలకు చెబుతూ ఉంటారు. న్యాయరాజధాని గురించి కర్నూలులో ర్యాలీలు తీశారు. పెయిడ్ మేధావులతో ఉద్యమాలు చేయించారు. విశాఖలోనూ గర్జనలు నిర్వహిచారు. ఇంతా చేస్తే.. అసలు అలాంటి ప్రతిపాదనే తప్పు అని.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్వెస్టర్లకు చెబుతున్నారు. అమరావతి నుంచి విశాఖకు రాజధాని మార్చాలంటే.. దానికో ప్రక్రియ ఉంటుంది. అమరావతి రాజధాని స్టేక్ హోల్డర్లకు న్యాయం చేసిన తర్వాతనే అలా చేయాలి. అలా చేయకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తూ.. రైతుల్ని మోసం చేయాలని ప్రయత్నించారు. ఇప్పుడు కర్నూలు ప్రజలనూ అలాగే మోసగించారు.
విశాఖలో రాజధాని పేరుతో పెద్ద ఎత్తున భూ దందాలు నడిపారు. ఇప్పుడు పెట్టుబడులు కావాలంటూ… విశాఖనే ఏకైక రాజధానిగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది కూడా పెట్టుబడిదారులను మోసం చేయడమే. తాము చట్టాలను ఉల్లంఘిస్తామని మీరు కూడా ఉల్లంఘించమని వారిని ప్రోత్సహించినట్లుగానే బుగ్గన మాటలున్నాయి. రాజధాని ఇప్పటికి అమరావతి. లీగల్ గా విశాఖ అవడానికి ఎలాంటి క్లియరెన్స్ లేదు. సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వస్తే తప్ప సాధ్యం కాదు. అలా రాక ముుందే ఇలా ప్రకటనలు చేయడం కోర్టు ధిక్కారం. అయినా ఇంతకు ముందు ప్రజల్ని మోసం చేశారు.. ఇప్పుడు పెట్టుబడిదారుల్ని మోసం చేస్తున్నారు. కానీ అంతిమంగా బలవుతోంది మాత్రం రాష్ట్రం.