నువ్వే మా నమ్మకం…. ప్రజలతో బలవంతంగా అనిపించడమ కాదు.. నేనే మీ భవిష్యత్ అని దబాయించడానికి కూడా రెండు ప్రచార కార్యక్రమాలను వైసీపీ నేతలు రెడీ చేసుకున్నారు వాలంటీర్లు, గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు అంటూ అందరూ కలిసి ప్రజల ఇళ్ల మీద పడబోతున్నారు. అందరూ కలిసి ఇంటికొకటి.. ఫోన్ మీదొకటి.. కుదిరితే మొహం మీదొకటి స్టిక్కర్లు వేసి వెళ్తారు. ఇలా చేయడానికి వెనుక ఉన్న వ్యూహం కేవలం… తాము ప్రభుత్వంలో ఉండగా.. .. ప్రజాధనాన్ని పదో పరకో.. ఊరకనే ఇచ్చామను… మాకు ఓటు వేయకపోతే… మీ భవిష్యత్ గురించి బెంగ పెట్టుకోవాల్సిందే అని హెచ్చరికలు పంపడమే. ఈ విషయం అందరికీ ఓ క్లారిటీ వస్తుంది.
ప్రజల్లో నమ్మకం కలగాలంటే… భయం పుట్టిస్తానంటే.. అది అడ్డం తిరుగుతుంది. వారికి మేలు చేస్తే నమ్మకం కలుగుతుంది. అలాంటి మేలు చేస్తే నిజంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో మేలు చేశాడయ్యా అని వాళ్లే గుర్తు పెట్టుకుని ప్రతిఫలంగా ఓటు ఇవ్వడానికి వస్తారు. కానీ ఇక్కడ అంత నమ్మకం కనిపిస్తున్నట్లుగా లేదు. స్టిక్కర్లు వేసేస్తున్నారు. ప్రజలు రాజకీయ నేతలకు భవిష్యత్ ఇస్తారు కానీ… ఎప్పటికీ ప్రజలకు రాజకీయ నేతలు భవిష్యత్ ఇవ్వలేరు. ఒక వేళ రాజకీయ నేతలు ఏదైనా మంచి పని చేసినా అది ప్రజలు ఇచ్చిన భవిష్యత్ వల్లే చేయగలుగుతారు. అందుకే ప్రజలకు తాను భవిష్యత్ ఇస్తానని అనుకుంటే అంత కంటే గర్వం ఏమీ ఉండదు.
ప్రజల్ని తక్కువ అంచనా వేయడం… ప్రచారం చేసుకుంటే ఓట్లేస్తానని అనుకోవడం… అమాయకత్వమే. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతీ విషయాన్ని బేరీజు వేసుకుంటారు. మర్చిపోతారని అనుకుంటే రాజకీయ నాయకుల అతి తెలివికి అంతకు మించిన సాక్ష్యం ఉండదు. రాజకీయం అంటే ప్రచారం కాదు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి అసలు కాదు. అధికారంలో ఉన్న పార్టీకి అసలు ప్రచారం పని చేయడం మాత్రమే. అది చేయకుండా.. మొత్తంగా ప్రచారం మాత్రమే చేసుకుంటానంటే… ప్రజలే భవిష్యత్ లేకుండా చేస్తారు. ముందే గుర్తిస్తే.. కనీసం పరువు కాపాడుకోవచ్చు…. తీర్పు చెప్పేదాకా గుర్తించకపోతే.. . చేతులు కాలాక ఆకులు కూడా పట్టుకోలేరు.