పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై క్లారిటీ రావడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాది ముందు నుంచే ఆయన ఉత్తరాంధ్ర నుంచి యాత్ర ప్రారంభించారు. ఆగుతూ సాగినా యాత్ర అయితే కొనసాగించారు. ఈ సారి మాత్రం యాత్ర ప్రారంభించడానికే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వారాహి పేరుతో ఓ భారీ వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ వాహనం నిబంధనలకు విరుద్ధంగా ఉందని.. అడ్డుకుంటామని అధికార పార్టీల నేతలు ప్రకటించారు. కానీ అడ్డుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అసలు వారాహీ రోడ్డు మీదకు రావడం లేదు.
ఇప్పుడు వైసీపీ నేతలే వారాహి రావడం లేదేమిటా అని వాకబు చేస్తున్నారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నందున వారాహి రోడ్డు మీదకు రావడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు.. వారాహి యాత్రకు సంబంధం ఏముటుంది ? . జనసేనాని కూడా ప్రజల్లోకి వస్తే వైసీపీ పాలనా తీరు వ్యవహారం అంతా ప్రజల్లోకి చర్చకు వస్తుంది. ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకత అంతా బహిరంగమవుతుంది. కానీ పవన్ బయటకు రాకపోవడాన్ని కూడా వైసీపీ.. టీడీపీకి ముడి పెడుతోంది.
పవన్ కల్యాణ్ తన సినీ షెడ్యూల్స్ ను బిజీగా ఉంచుకున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ.. ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగానే సమయం ఉన్నందున… చివరి ఆరు నెలలు జనంలో ఉంటే చాలని ఆయన అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు… వీకెండ్లో కూడా పార్టీకార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. నాదెండ్ల మనోహర్ ఒక్కరే తిరుగుతున్నారు. కానీ ఆయన వల్ల పార్టీకి ఏమైనా మైలేజ్ వస్తుందా అంటే చెప్పడం కష్టమే.