బీజేపీకి కన్నా లక్ష్మినారాయణ రాజీనామా చేశారు. హఠాత్తుగా అనుచరులతో సమావేశం అయిన ఆయన తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు ఆయన అనుచరులు కూడా ఆయనతో పాటే రాజీనామా చేశారు. తాను పార్టీ వీడటానికి సోము వీర్రాజే కారణం అని కన్నా స్పష్టం చేశారు. యన వల్లే పార్టీలో ఇమడలేకపోయా. పార్టీతో చర్చించకుండా జీవీఎల్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. రంగా పేరు క్రిష్ణా జిల్లాకు పెట్టాలని గతంలోనే ఉద్యమం చేశాం. అప్పుడే జీవీఎల్ ఉద్యమంలో పాల్గొంటే బాగుండేది. కొందరు ఓవర్ నైట్ స్టార్ నేత కావాలని ప్రయత్నిస్తున్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక పార్టీలో పరిస్థితులు మారాయని విమర్శించారు.
2014లో నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడిని అయ్యానని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఆ నాటి నుంచి పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా ఓ కార్యకర్త తరహాలో పని చేసుకుంటూ వచ్చానని గుర్తు చేసుకున్నారు. తన పనిని గుర్తించి 2018లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇచ్చారని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని, మోదీ నాయకత్వంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేశానని అన్నారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా బీజేపీలో చేరారని అన్నారు. సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నామని అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాడామని అన్నారు. మోదీ అంటే జీవితకాల అభిమానం ఉన్నప్పటికీ పార్టీలో ఇమడలేకపోయానని అభిమానులకు వివరించారు.
కన్నా లక్ష్మినారాయణ గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి క్షణంలో అమిత్ షా ఫోన్ చేసి.. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో… అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో చేరి తర్వాత బీజేపీలోనే కొనసాగారు. ఆయనకు పదవి ఇచ్చినా గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకపోవడంతో పాటు.. ఎక్కువ మంది వైసీపీకి అనుకూలంగా పని చేయడంతో అంతా ఓటమి పాలయ్యారు. నోటాతో పాటు కూడా ఓట్లు తెచ్చుకోలేకపోయారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. కరోనా సమయంలో ప్రభుత్వ అవినీతిపై తీవ్రంగా పోరాడుతున్న సమయంలో హఠాత్తుగా ఆయనను తొలగించి సోము వీర్రాజుక పదవి ఇచ్చారు. అప్పట్నుంచి ఏపీ బీజేపీ .. వైసీపీ అనుబంధ సంస్థగా మారిందన్న అభిప్రాయం పెరిగింది.,
కొన్నాళ్లుగా కన్నా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. పవన్ తో పొత్తు విషయంలో నిర్లక్ష్యం… ఎన్నికల్లో వైసీపీకి మేలు చేసే విధానాలు పాటిస్తున్నారన్న అను్మానంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూా గెలవాలన్న ఉద్దేశంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చివరికి ఆయన టీడీపీలో చేరనున్నారనని.. ఈ నెల ఇరవై నాలుగున లేదా.. ఆ తర్వాత టీడీపీలో చేరవచ్చని భావిస్తున్నారు.