గత ఎన్నికల తర్వాత టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడం ఇక భవిష్యత్ ఉంటుందో ఉండదో అన్న భయానికి టీడీపీ నేతలు వచ్చిన సమయంలో… ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా అడ్వాంటేజ్ తీసుకున్నారు. చాలా మంది ప్రజాదరణ ఉన్న నాయకుల్ని పార్టీలో చేర్చుకున్నారు. స్వయంగా కన్నా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పదిహేనేళ్లు మంత్రిగా ఉన్నారు. అలాంటి నేత సారధ్యంలో చాలా మంది నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరారు.
రాయలసీమలో ఆదినారాయణ రెడ్డి, వరదాపురం సూరి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కర్నూలు ఎంపీ టీజీ వెంకటేష్ వంటి వారు చేరారు. కోస్తా.. ఉత్తరాంధ్రల నుంచి కూడా చేరారు. అయితే ఇలా చేరిన వారందర్నీ పక్కన పెట్టేసింది బీజేపీ హైకమాండ్. కన్నాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత అలా పార్టీలో చేరిన వారందర్నీ పక్కన పెట్టేశారు. అంతే కాదు కోవర్టుల ముద్ర వేసి అసలు పార్టీ కార్యక్రమాలకూ పిలవడం మానేశారు. ఫలితంగా వారంతా పక్క చూపులు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలో ఉన్న మాస్ లీడర్లంతా పార్టీలో ఉండటం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.
సోము వీర్రాజు ఏం చేసినా హైకమాండ్ ఆదేశాలతోనే చేశారని జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. అంటే.. ఇలా మాస్ లీడర్లందర్నీ పక్కన పెట్టేసి.. కేవలం పార్టీని అంటి పెట్టుకుని.. అటు ప్రజల్లో పలుకుబడి తెచ్చుకోలేక.. పార్టీని బలోపేతం చేయలేని నాయకులే చాలని హైకమాండ్ అనుకుంటోందా అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. జాతీయ రాజకీయాల కోణంలో పార్టీ బలోపేతం కన్నా.. మిత్రులకు అండగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్న వాదన వినిపిస్తోంది.
సోము వీర్రాజు, జీవీఎల్ వంటి వాళ్లు హైకమాండ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారన్న అనుమానాలు కూడా పార్టీ నేతల్లో ఉన్నాయి. అసలే ఒక్క శాతం కూడా లేని పార్టీని మరింతగా నాశనం చేస్తున్నారని.. కేంద్రంలో అధికారంలో ఉన్న అడ్వాంటేజ్ ఉంచుకుని దాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.