ఫామ్ హౌస్ కేసులో సీబీఐ విచారణను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి చివరి ఆప్షన్ కూడా తప్పిపోయినట్లయింది. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే ఈ కేసులో ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని ఈ క్రమంమలో కేసును సీబీఐ కి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసుపై వాదనల కోసం మరింత సమయం కావాలని కోరారు. ఈ కేసులో సీబీఐ ఒత్తిడి చేయకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ధర్మాసనం మాత్రం సీబీఐని తాము నియంత్రించలేమని స్పష్టం చేసి తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది.
నిజానికి పిటిషన్ వేసినప్పుడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తీర్పు అమలుపై స్టే కోరినా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. అయినా సిట్ వద్ద ఉన్న డీటెయిల్స్ ఇవ్వడానికి తెంంగాణ సీఎస్ సిద్ధం కాలేదు. వాటి కోసం ఎస్పీ స్థాయి అధికారి సీఎస్ కి ఆరుసార్లు లేఖ రాశారు. సుప్రీంలో విచారణ తర్వాత ఇస్తామని మౌఖికంగా సమాధానం చెబుతున్నారు. ఇప్పుడు సీబీఐ .. ఫామ్ హౌస్ వివరాలు ఇవ్వకపోతే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఫామ్ హౌస్ కును బీఆర్ఎస్ ..,బీజేపీపై రాజకీయ పోరాటానికి ఆయుధంగా ఎంచుకుంది. కానీ అనూహ్యంగా ఇది సీబీఐ చేతుల్లోకి వెళ్తూండటం ఆ పార్టీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే.., వీలైనంత వరకూ అత్యున్నత స్థాయిలో న్యాయపోరాటం చేసి కేసు సీబీఐకి వెళ్లకుండా చూడాలనుకుంటున్నారు. కానీ సుప్రీంకోర్టులోనూ అనుకూల ఫలితం రావడం లేదు.
ఫాంహౌస్ కేసు విచారించేందుకు సీబీఐ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయితే ఫామ్ హౌస్ డీటైల్స్ ఇచ్చే వరకూ చూడకుండా ఒక్క సారిగా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.