బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తామంటూ హడావుడి చేస్తున్న ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నానిల పోరు పడలేకేమో కానీ సీఎం జగన్ నిరాశక్తత చూపిస్తున్నారు. ఆయన సమయం ఇవ్వకపోతూండటంతో.. పనులు ప్రారంభిస్తామని.. శంకుస్థాపనలు ఉండవని ఎంపీ బాలశౌరి చెబుతున్నారు. మొదట 2008లో పోర్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న మైటాస్ సంస్థ రూ.100 కోట్లకుపైగా బ్యాంకు రుణాలు తీసుకుంది. నిర్మాణ పనులు ప్రారంభించకుం డానే ఆర్థికంగా మునిగిపోయింది. ఆ తర్వాత పిపిపి పద్ధతిలో నిర్మాణానికి నవయుగ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
2019 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పనులను ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం కొద్ది రోజులకే ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. తాజాగా ఇపిసి పద్ధతిలో నిర్మాణానికి మారిటైం బోర్డు ద్వారా టెండర్లు ఆహ్వానించింది. మెగా ఇంజినీరింగ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆరు నెలల కిందటే ఈ టెండర్లు ఖరారైనప్పటికీ మెగా ఇంకా పనులు ప్రారంభించలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు లభించాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
కేంద్రం సహకారంతో అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చి, నిర్మాణ పనులకు శంకుస్థాపన కాకుండా, పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పార్లమెంట్ సభ్యులు బాలశౌరి చెబుతున్నారు. అయితే నిజంగా అన్ని అనుమతులు వస్తే.. సీఎం జగన్ శంకుస్థాపన ఎందుకు చేయరని.. స్టీల్ ప్లాంట్నే రెండు సార్లు శంకుస్థాపన చేశారనే సంగతిని గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ పనులన్నీ ఆపేసి.. నాలుగేళ్ల పాటు.. అలా ఉంచేసి.. ఇప్పుడు కొత్తగా పనులు ప్రారంభిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.. . కానీ ఈ నాలుగేళ్ల పాటు జరిగిన నష్టం గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు.