బీజేపీని కాదన్నందుకు..కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు.. ఇప్పుడు బాల్ థాక్రే కుమారుడు ఉద్దవ్ థాక్రే రోడ్డున పడిపోయారు. ఆయన పార్టీ శివసేన కానీ.. ఆయన పార్టీ గుర్తు కానీ ఆయనది కాదని.. ఏక్ నాథ్ షిండేదని ఎన్నికల సంఘం తేల్చింది. దీనికి ఈసీ విచిత్రమైన లెక్కలు చెప్పింది. ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు పోలైన ఓట్లు… ఇప్పటికీ ఉద్దవ్ థాక్రేతో పాటు ఉన్న ఎమ్మెల్యేలకు పోలైన ఓట్లను చూసింది. అత్యధికం షిండే వర్గానికి ఉన్నాయి కాబట్టి ఆ పార్టీని షిండే వర్గానికి ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఇదే ఫార్ములాను ఎంపీ ఓట్ల విషయంలోనూ చూపించింది. అత్యధిక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు షిండే వర్గంలోకి వెళ్లిపోయారు.
అయితే అసలు శివసేన అనే పార్టీ బ్రాండ్.. ఇమేజ్ మొత్తం బాల్ థాక్రే కుటుంబసభ్యులదే. చీలిపోయిన ఏక్ నాథ్ షిండే ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే థాక్రే ఫ్యామిలీ అండ లేకుండా గెలుస్తారని చెప్పడం కష్టం. శివసేన అంటే బాల్ థాక్రే ఫ్యామిలీదని ప్రజలు నమ్ముతారు. వారిని చూసే ఓట్లు వేస్తారు. అయినా ఈసీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు షిండే వైపు ఉన్నారు కాబట్టి వారికే శివసేనను కేటాయించింది. ముఖ్యమంత్రిగా ఉన్న షిండే … ఏమీచేయలేకపోతున్నారు. మొత్తం దేవంద్ర ఫడ్నవీస్ వ్యవహారాలు చక్క బెడుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తికి గురవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో శివసేన పార్టీని పూర్తిగా థాక్రే ఫ్యామిలీకి దూరం చేయడంతో ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. బీజేపీలో విలీనం చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నిజానికి ఇంతకు ముందే శివసేన పార్టీ పేరు, గుర్తును ఈసీ స్తంభింపచేసింది. అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో శివసేన థాక్రే వర్గానిక కాగడా గుర్తు కేటాయించారు. ఆ ఎన్నికల్లో థాక్రే వర్గం అభ్యర్థి 77వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయినా ఇప్పుడు.. పార్టీని వారిది కాదని ఈసీ తేల్చేసింది.