చంద్రబాబునాయుడు మూడు రోజుల తూ.గో జిల్లా పర్యటనకు వెళ్లారు. మొదటి రెండు రోజులు కార్యక్రమాలు వార్తల్లో భాగంగా వచ్చాయి.. వెళ్లాయి. మీడియాలో సాధారణ వార్తల్లా వచ్చాయి. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి కలత చెందారమో కానీ.. వెంటనే పోలీసుల్ని అప్రమత్తం చేశారు. చంద్రబాబు టూర్కు ఎలా చేస్తే హైప్ వస్తుందో ఖచ్చితంగా అంచనా వేసినట్లుగా పోలీసుల్ని మోహరించి అదే పని చేశారు. చివరికి చంద్రబాబు పర్యటనను రాష్ట్రం మొత్తం చెప్పుకునేలా చర్చించుకునేలా ముగిసేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు.
ఉదయం చంద్రబాబు ఆనపర్తిలో నిర్వహించదల్చుకున్న సభకు ఇచ్చిన పర్మిషన్ రద్దు్తో ఎపిసోడ్ ప్రారంభమయింది. ఎక్కడిక్కడ కార్యకర్తల్ని అడ్డుకోవడంతో ప్రారంభించారు. ఆనపర్తిని దిగ్బంధించారు. చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో పాల్గొని రాజమండ్రి నుంచి ఆనపర్తి బయలుదేరారు. కానీ పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. రోడ్లకు అడ్డంగా లారీలు పెట్టారు. తాము కూడా కూర్చున్నారు. ఇదందా చూస్తున్న జనం.. ఔరా పోలీసులు అనుకున్నారు. కానీ చంద్రబాబు పాదయాత్రగా ఆనపర్తి వెళ్లారు గంటలో ఎనిమిది కిలోమీటర్లు నడిచి ఆనపర్తి చేరుకున్నారు.
అక్కడికి చేరుకునే సరికి జనం కిక్కిరిసిపోయారు. చంద్రబాబు సభకు పోలీసుల ఆటంకాలతో పాటు ఆయన నడుచుకుంటూ వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున జనం గుమికూడారు. దీంతో పోలీసులు కూడా అలా చూస్తూండిపోవాల్సి వచ్చింది. మామూలుగా చంద్రబాబు సభకు అనుమతి ఇచ్చి ఉంటే.. ఆయన పర్యటన కామెంట్లు.. అన్నీ సాధారణ వార్తల్లో కలిసిపోయి ఉండేవి. కానీ చంద్రబాబు పర్యటనకు ప్రత్యేకమైన స్పెషల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడంలో వైసీపీ పద్దలు సక్సెస్ అయ్యారు. దీంతో టీడీపీ నేతలు కూడా ధ్యాంక్స్ జగన్ అని సెటైర్లు వేస్తున్నారు.