తెలంగాణాలో తెదేపా ఎమ్మెల్యేలు, నేతలు ఒకరొకరుగా తెరాసలోకి దూకేస్తుంటే అక్కడ క్రమంగా తెలుగు దేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతోంది. అలాగే తెలంగాణాలో వైకాపా నామ మాత్రంగానే మిగిలి ఉంది. అది తన ఉనికిని చాటుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ నేపధ్యంలో ఖమ్మం జిల్లాలో ఆ రెండు పార్టీల నేతల మధ్య జరుగుతున్న వాదోపవాదాలు వింటే ఎవరయినా నవ్వుకోకుండా ఉండలేరు.
వైకాపా తెలంగాణా అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అందుకు సత్తుపల్లి తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆయనను విమర్శిస్తున్నారు. తన వ్యాపార లావాదేవీలకు ప్రభుత్వం నుంచి ఆటంకాలు ఎదురవకుండా ఉండేందుకే ఆయన తెరాసకి సహకరిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయన ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పొంగులేటి కూడా తెరాసలో కలిసిపోవడం ఖాయమని వీరయ్య జోస్యం చెప్పారు.
ఆయన ఆరోపణలను పొంగులేటి ఖండించారు. తనకు తెరాస ప్రభుత్వంతో ఎటువంటి లావాదేవీలు లేవని చెప్పారు. తెలంగాణాలో తమ పార్టీ ఎదుగుదలని చూసి ఓర్వలేకనే తెదేపా నేతలు తనపై లేనిపోనీ ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రతివిమర్శించారు.
వీరయ్య ఆరోపణలు, దానికి పొంగులేటి సమాధానం రెండూ కూడా చాలా హాస్యాస్పదంగానే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పోటీ చేయకూడదని వైకాపా నిశ్చయించుకొన్నప్పుడు తెరాసకు పరోక్షంగా సహకరించేందుకే పోటీ నుండి తప్పుకొందని తెదేపా నేతలు ఆరోపించారు. ఇప్పుడు ఖమ్మం మునిసిపల్ ఎన్నికలలో పొంగులేటి పోటీ చేస్తుంటే అది కూడా తెరాసకు సహకరించేందుకేనని తెదేపా వాదించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
తెదేపాలో ఏ ఎమ్మెల్యే ఎంత కాలం ఉంటారో, ఎప్పుడు తెరాసలో చేరిపోతారో తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు, పొంగులేటి గురించి వీరయ్య ఆవిధంగా జోస్యం చెప్పడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది.
దానికి పొంగులేటి ఇచ్చిన సమాధానం ఇంకా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణాలో వైకాపా ‘ఎదుగుదల’ ని చూసి ఓర్వలేకనే తెదేపా నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని పొంగులేటి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణాలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి వారిద్దరూ కూడా తెరాసలో కనబడినా ఆశ్చర్యం లేదు.