ఏపీ రాజకీయాల్లో మార్పు కోసం మునిగిపోతున్న జగన్ ను గట్టెక్కించి మళ్లీ సీఎం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూ. వెయ్యి కోట్లయినా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్‌కు చెప్పారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. కొత్త పలుకులో రాసుకొచ్చారు. జగన్ ను సీఎంను చేస్తానని.. పవన్‌కు ఎందుకు చెబుతారనేది ఇక్కడ లాజిక్. అంటే.. ఆర్కే చెప్పిన దాని ప్రకారం అసలు లక్ష్యం జగన్ ను సీఎం చేయడం… చేసే ప్రయత్నం మాత్రం పవన్ వైపు నుంచన్నమాట.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఉంటే జగన్ ఓటమి ఖాయమని.. అలా జరగకుండా.. పవన్ ను ఒంటరిగా లేదా బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయడం ద్వారా ఓట్లు చీలికకు ప్రయత్నం చేస్తున్నారని అంతిమంగా పవన్ కు రూ. వెయ్యి కోట్లు.. జగన్ కు సీఎం పదవి అన్న పద్దతిలో ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ ఇంత ఖర్చు ఎందుకు పెట్టుకుంటున్నారన్నది ఆర్కే క్లారిటీ ఇవ్వలేదు. రూ. వెయ్యి కోట్లంటే చిన్న మొత్తం కాదు. కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో తనతో కలసి వచ్చే పార్టీలకు ఇవే ఆఫర్లు ఇస్తున్నారని ఆర్కే కొంత కాలంగా చెబుతున్నారు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తర్వాత చెప్పుకుందామని హింట్ ఇచ్చారు. అయితే జగన్ ను సీఎం చేస్తే… కేసీఆర్ కు వచ్చే లాభమేంటి అంటే.. చంద్రబాబు మళ్లీ సీఎం కాకూడదన్న పట్టుదలత.. తర్వాత జగన్ పార్టీ తరపున గెలిచే ఎంపీలు తన వెంటే ఉంటారన్న నమ్మకం కారణంగానే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయాన్నిఆర్కే పరోక్షంగా పంపారు.
అయితే ఆర్కే ఇక్కడ ఓ లాజిక్ మిస్సయినట్లుగా కనిపిస్తోంది. ఏపీలో కంటే తెలంగాణలోనే ముందుగా ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నవంబర్, డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఐదు నెలలకు ఏపీలో జరగనున్నాయి . తెలంగాణలో ఫలితం తేడా వస్తే తర్వాత కేసీఆర్ ఒక్క ప్రణాళికనూ అమలు చేయలేరు. ముందుగా ఆయన తెలంగాణలో గెలవాల్సి ఉంది. అలా కాకుండా ఆ తర్వాత వ్యూహాల కోసం ఇలా వేల కోట్లు వెచ్చిస్తారా అన్నది సందేహమే.
జగన్ కు సహకరించడానికి.. కేసీఆర్ రూ. వేయి కోట్లు ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నదానికి ఆర్కే చెప్పిన కారణాలు కూడా అంత సహేతుకుంగా ఉండటం లేదు. తెలంగాణలో టీడీపీ దూకుడుగా ఉంటే.. అది తమ ఓటు బ్యాంకుకే కన్నం పడుతుదని.. దానికి బదులుగా పవన్ ను దువ్వితే కాపు ఓటు బ్యాంక్ కలసి వస్తుందని నమ్ముతున్నారు. పవన్ ను చూసి .. తెలంగాణలో కాపులు ఓట్లు వేస్తారని ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోవడం లేదు. కానీ ఆర్కే మాత్రం అలా అనుకుని కేసీఆర్ వ్యూహాల్లో చోటిచ్చేశారు. కేసీఆర్.. జగన్ కోసం … పవన్ వద్దకు రాయబారాలు పంపుతున్నారో లేదో భవిష్యత్‌లో తేలే అవకాశ ఉంది.