వైఎస్ అవినాష్ రెడ్డి…. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు సీబీఐ నోటీసులు జారీ చేయడం రాజకీయవర్గాల్లోనూ సంచలనం అవుతోంది. అవినాష్ రెడ్డిని రెండో సారి హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకు రావాలని ఆదేశించారు. భాస్కర్ రెడ్డికి మాత్రం ఎక్కడ విచారణకు హాజరు కావాలో చాయిస్ ఇచ్చారు. అవినాష్ రెడ్డిని రెండో సారి పిలవడంతో ఆయనను అరెస్ట్ చేయడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అరెస్టు కోసం లోక్ సభ స్పీకర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నారని చాలా రోజులక్రితమే ప్రచారం జరిగింది. వివేకా హత్య ఘటన జరిగినప్పుడు సాక్ష్యాలు తుడిచేయడం దగ్గర్నుంచి ప్రతీ విషయంలో అనుమానాస్పదంగా వ్యవహరించింది అవినాష్ రెడ్డినే.
వివేకా హత్య గురించి ఉదయం తెలిసిందని అవినాష్ రెడ్డి అందరికీ చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన తెల్లవారు జామున మూడున్నర గంటలకే జగన్ పీఏ, భారతి పీఏలకు ఫోన్లు చేశారు. అసలు పని మనిషి వచ్చిన వరకూ హత్య గురించి ఎవరికీ తెలియదని.. ఇప్పటి వరకూ చెప్పారు. మరి మూడున్నరకే ఇతరులకు సమాచారం ఇచ్చేలా ఎలా తెలిసిందన్నది సీబీఐ ప్రధానంగా తేల్చే పనిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా వైఎస్ వివేకా హత్య కేసు… ఛేదించలేదనంత క్లిష్టమైన కేసేమీ కాదు. సింపుల్గా నేరస్తుల్ని అరెస్టు చేయగలిగే కేసు. కానీ ఇది హై ప్రోఫైల్ కేసు కావడం… నిందితులు కూడా అధికార బలం ప్రయోగిస్తూండటంతో సమస్యగా మారింది.
అయితే సీబీఐ పట్టు వదలకుండా ప్రయత్నిస్తోంది. వివేకా హత్య కేసులో తాము ఎదుర్కొన్న ఒత్తిళ్లు కూడా సీబీఐ అధికారుల్లో మరితం పట్టుదలను పెంచాయంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని అనుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో విచారణ హైదరాబాద్కు మారడంతో సీబీఐపై ఒత్తిడి తగ్గినట్లవుతోంది. ఈ విషయంలో ఈ నెలలోనే కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.