జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2014 సార్వత్రిక ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి, వాటి తరపున ప్రచారం చేసి వాటి తరపున ప్రజలకు హామీగా నిలబడ్డారు. ఒకవేళ ఆ రెండు పార్టీలు తమ హామీలను నిలబెట్టుకోకపోతే తనే ప్రజల తరపున వాటిని గట్టిగా నిలదీస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన కూడా ప్రజలకు ఇచ్చిన ఆ హామీని నిలబెట్టుకోలేకపోతున్నారు.
ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులు, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ ఏర్పాటు ఇలాగ చాలా హామీలను కేంద్రప్రభుత్వం ఒకటొకటిగా తీసి పక్కనపెడుతున్నా పవన్ కళ్యాణ్ ఏనాడూ గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నించలేదు. పైగా బీజేపీకి మిత్రపక్షంగా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెదేపా వాటి కోసం ప్రధాని నరేంద్ర మోడిపై ఒత్తిడి తేలేనప్పుడు తన ఒక్కడివలన ఏమవుతుందని ప్రశ్నించారు.
కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయినందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెదేపా ప్రభుత్వాన్ని ఏవిధంగా నిందిస్తుంటారో, పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా తెదేపా ఎంపిలను విమర్శించారు తప్ప మోడీకి వ్యతిరేకంగా ఎన్నడూ పల్లెత్తు మాటనలేదు. పైగా ఈ హామీల అమలు కోసం మోడీ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చి చూద్దామని వెనకేసుకు వచ్చేరు. అపుడు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలకి మధ్య తేడా ఏమి కనబడటం లేదని స్పష్టమవుతోంది.
మొన్న రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి హామీ ఇచ్చిన రైల్వే జోన్ ప్రకటన లేకపోయినా, నిన్న ఆర్ధిక బడ్జెట్ లో రాజధానికి, పోలవరానికి నిధులేవీ విదిలించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా అడిగే సాహసం చేయలేకపోయింది. జగన్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ కూడా అంతే! ఎవరూ కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడిగే పరిస్థితి లేదు. ఎవరి సమస్యలు, సాకులు వారికున్నాయి. పవన్ కళ్యాణ్ కేంద్రప్రభుత్వాన్ని నిలదీయలేకపోవచ్చును. కనీసం ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్నయినా ఎందుకు నిలదీయలేకపోతున్నారో తెలియదు. ఇసుక మాఫియా, తాత్కాలిక సచివాలయంపై కోట్లు కుమ్మరించడం, రెండేళ్ళు పూర్తికావస్తున్న రాజధాని నిర్మాణ పనులు మొదలుకాకపోవడం, వైకాపా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు వంటి అనేక అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ అసలు స్పందించడం లేదు.
కేంద్రప్రభుత్వ సహాయ సహకారాలు ఆశించే తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొంది. కానీ ఆ ప్రయోజనం నెరవేరకపోయినా చంద్రబాబు నాయుడు మోడీ ప్రభుత్వం పట్ల చాలా వినయవిదేయతలు ప్రదర్శిస్తున్నారు. ఆ రెండు పార్టీలు తమ హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయినప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా వాటిని గట్టిగా నిలదీసి అడగాలనుకోవడం లేదు. ఆయన చంద్రబాబు పట్ల వినయంగా ప్రవర్తిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
చంద్రబాబు నాయుడు మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోతున్నారంటే అందుకు చాలా కారణాలున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఆ రెండు పార్టీలపై ఒత్తిడి తేకపోవడానికి ఒక్క బలమయిన కారణం కూడా కనబడటం లేదు. ఆ రెండు పార్టీల తరపున ఎన్నికలలో ప్రచారం చేసి, వాటి తరపున ప్రజలకు హామీగా ఉన్నందుకు ఆయన కూడా వాటి వైఫల్యాలకు బాధ్యత వహించక తప్పదు. కనుక ఇప్పటికయినా ఆయన చొరవ తీసుకొంటే బాగుంటుంది లేకుంటే వచ్చే ఎన్నికలలో జనం ఆయన మొహం చూసి ఓట్లేసే పరిస్థితి ఉండకపోవచ్చును.