ఏపీలో అరాచక వ్యవస్థ రోజు రోజుకు వికృతరూపం దాలుస్తోంది. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చంపేస్తామన్నట్లుగా తీరు ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు, ఇళ్లు, కార్యాలయాలపై జరుగుతున్న దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఆఫీసుపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేశారు. కత్తులు, పెట్రోల్ క్యాన్లతో ప్రణాళిక ప్రకారం వచ్చి విధ్వంసం సృష్టించారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్లపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దొరకిన వారిని దొరికినట్లుగా కొట్టే ప్రయత్నం చేశారు.
ఇంత జరుగుతున్న పోలీసులు ఎవరూ .. వైసీపీ నేతలు దాడులు చేసి వెళ్లేవరకూ ఒక్కరూ రాలేదు. వారు వెళ్లిపోయిన తర్వాత తీరికగా వచ్చారు. కృష్ణా జిల్లాలో చాలా కాలంగా పోలీసులు దాడులు జరిగిన తర్వాతే వస్తున్నారు. పట్టాభి ఇంట్లో దాడి జరిగిన సమయంలో ముందుగా పోలీసులే రెక్కీ నిర్వహించి సమాచారం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన సమయంలో ఓ సీఐ… టీడీపీ నేతలకు చిక్కారు. ఇప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేసిన విషయంలోనూ పోలీసుల విధి నిర్వహణ తీరు అనేక విమర్శలకు కారణం అవుతోంది.
ప్రతిపక్ష నేతల పర్యటనలను అడ్డుకోవడానికి వేల మంది పోలీసుల్ని మోహరిస్తున్నారు. అరాచక శక్తుల నుంచి .. ప్రజలను కాపాడటానికి మాత్రం ఎలాంటి ప్రయత్నం చే్యడం లేదు. రాజకీయ వివాదాలు.. విమర్శలకు .. దాడులు చేస్తాం.. అంతం చేస్తామన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది. ముఖ్యమంత్రే.. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. టీడీపీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సమయంలో మా కార్యకర్తలకు బీపీ వచ్చిందని ఆయన సమర్థించుకున్నారు. ఇప్పుడు గన్నవరంలో వైసీపీ కార్యకర్తలకు బీపీ వచ్చిందని.. వల్లభనేని వంశీ సమర్థించుకుంటారమో చూడాల్సి ఉంది.
ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు కాపాడటం ప్రభుత్వాల విధి. అందులో ఫెయిలయితే.. పాలనలో విఫలమయినట్లే. అయితే ప్రతిపక్షాలపై.. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం.. తమ హక్కు అన్నట్లుగా పాలక పార్టీ ఉండటంతో ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది.