దర్శకుడైపోయాక త్రివిక్రమ్ రచయితగా మరో దర్శకుడి దగ్గర పని చేయడానికి ఇష్టపడలేదు. పవన్ కల్యాణ్ తీన్‌మార్ కోసం మాత్రం పెన్ను చేసుకోవాల్సివచ్చింది. మొన్నటికి మొన్న.. భీమ్లా నాయక్‌కి అంతా తానే అయ్యాడు. ఆ సినిమాకి గానూ త్రివిక్రమ్‌కి భారీ పారితోషికం దక్కింది కూడా. ఇప్పుడు మరోసారి పవన్ కోసం పెన్ను చేసుకోక తప్పడం లేదు.
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. వినోదయ సీతమ్‌కి ఇది రీమేక్. ఈ సినిమాకి మాటల రచయితగా బుర్రా సాయిమాధవ్‌ని ఎంచుకొన్నారు. అయితే స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్రమ్‌దే. రీమేక్ కథని పవన్ శైలికి అనుగుణంగా కొన్ని కీలకమైన మార్పులు చేశాడు త్రివిక్రమ్. అయితే ఇక్కడితో త్రివిక్రమ్ పని అయిపోలేదు. ఇప్పుడు ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగులూ రాస్తున్నాడట. తనకున్న ప్రాజెక్టులు, బిజీ షెడ్యూల్ వల్ల.. బుర్రా సాయిమాధవ్ ఈ సినిమా నుంచి తప్పుకొన్నట్టు తెలుస్తోంది. దాంతో ఆ బాధ్యతని కూడా త్రివిక్రమ్ మోయబోతున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు మహేష్ బాబు సినిమా పనుల్లో త్రివిక్రమ్ తలమునకలైపోయాడు. దానికి తోడు రీమేక్ బాధ్యతలు త్రివిక్రమ్ తన భుజాన వేసుకొన్నాడు. నిజానికి బుర్రా స్థానంలో మరో రచయితని ఎంచుకోవాలని అనుకొన్నారు. కానీ… పవన్ మాత్రం త్రివిక్రమ్ రాస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో..త్రివిక్రమ్‌కి మరో ఆప్షన్ లేకుండా పోయింది. మరి ఈ రెండింటినీ త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.