గన్నవరం టీడీపీ ఆఫీసుపై రౌడీషీటర్లు, నేర రికార్డు ఉన్న వారు దాడులు చేస్తూంటే.. అన్నా.. అన్నా అని బతిమాలుకున్న పోలీసులు… వారు ఎంత విధ్వంసం చేసినా.. చివరికి టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. కారణం ఏమిటంటే.. వారు రెచ్చగొట్టారట. రెచ్చగొట్టినందునే వారు దాడులు చేశారని టీడీపీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇందులో పట్టాభి కూడా ఉన్నారు. ఆయనపై అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. అసలు రెచ్చగొట్టడం అంటే ఏమిటో… దాడులు చేసిన వారిని వదిలిసే.. రెచ్చగొట్టడం పేరుతో కేసులు పెట్టడం ఏమిటో ఏపీ పోలీసులకే తెలియాలని టీడీపీ నేతలు మండి పడుతున్నారు.
గన్నవరంలో దాడి తమ పనేనని వల్లభనేని వంశీ స్వయంగా ప్రకటించారు. దాడి సమయంలో తాను అక్కడే ఉన్నానన్నారు. అయితే ఆయన తనను పిల్ల సైకో అంటూ రెచ్చగొట్టారని అంటున్నారు. ఆయనను పిల్ల సైకో అన్నందుకు రెచ్చిపోయి.. దాడులు చేశామని ఒప్పుకుంటున్నారు. కానీ ఇలా ఒప్పుకున్నందుకు ఆయనపై కనీస కేసు కూడా లేదు. దాడులకు గురై వాహనాలు పోగొట్టుకున్న నేతలు మాత్రం జైల్లో ఉన్నారు. పిల్ల సైకో అన్నందుకే.. వల్లభనేని వంశీ రెచ్చిపోతే ఆయన గతంలో చంద్రబాబు, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు ఏమి చేయాలన్న ప్రశ్న టీడీపీ వర్గాల నుంచి వస్తోంది.
కారణం ఏదైనా పోలీసుల తీరు మాత్రం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. వీడియోలు వైరల్ అవుతున్నారు. పోలీసులు ఇంత నిస్తేజంగా ఎందుకు మారిపోయారన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా ఉంటారు. కానీ ఇప్పుడు పోలీసులకు ఆ స్వేచ్చ కూడా లేకుండా పోయింది. ఎవరు దాడులు చేసినా.. పాపం రెచ్చిపోవడం వల్ల ఈ దాడులు జరిగాయి.. రెచ్చగొట్టడం వల్లే జరిగాయని.. బాధితులపైనే కేసులు పెట్టి లోపలేస్తున్నారు.