సాక్షి పత్రికలో షర్మిల ఫోటోతో ఉన్న ప్రకటనను డబ్బులు తీసుకుని మరీ వేయలేదని ఆరోపిస్తూ పులివెందులకు చెందిన ఓ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కోర్టును కూడా ఆశ్రయించడం హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం ఆయన ఫిర్యాదులో వైఎస్ భారతి పేరు కూడా ప్రస్తావించారు. భారతి ఆదేశాల మేరకే షర్మిల ఫోటో ఉన్న వైఎస్ జయంతి ప్రకటనను వేయలేదని ఆయన అంటున్నారు. మొత్తానికి ఓ పత్రికలో ప్రకటన వేయాలా వద్దా అన్నది ఆ పత్రిక ఇష్టం. డబ్బులిస్తాం అని ఎవరైనా అంటే.. అన్నీ వేయరు. ఇక్కడ సాక్షికి సాక్షి యజమాని అయిన భారతికి ఆ హక్కు ఉంది.
కానీ పులివెందుల రెడ్డి ఎందుకు కోర్టుకు … పోలీసుల వరకూ వెళ్లారు.. దాన్ని నచ్చని మీడియాకు ఎందుకు లీక్ చేశారన్నది సంచలనంగా మారింది. కేవలం భారతి వల్లే కుటుంబంలో విబేధాలున్నాయని చెప్పేందుకు ఓ వర్గం ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం ఈ ఫిర్యాదు వల్ల ఏర్పడుతోంది. షర్మిలకు సన్నిహితుడైన ఆ రెడ్డి పెద్దల అనుమతి లేకపోతే ఫిర్యాదు చేయరని అంటున్నారు. నిజానికి సాక్షి పత్రికలో షర్మిల పేరుతో ప్రకటనలే కాదు.. ఎప్పుడో వార్తలు కూడా ఆపేశారు. రెండు, మూడేళ్ల కిందట… అప్పట్లో ఫీచర్స్ ఎడిటర్ గా ఉన్న రామ్… షర్మిల పాదయాత్ర కు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రెండు పేజీల ప్రత్యేక ఆర్టికల్ రాయించి రెడీ చేశారు. విషయం తెలిసిన భారతి ఆ ఆర్టికల్ ప్రింటింగ్‌ను ఆపేయించడమే కాదు.. రామ్ కు గుమ్మం చూపించారు. అప్పట్లోనే ఏదో జరుగుతోందని అనుకున్నారు.
ఇటీవల సాక్షిలో ఆమెకు కవరేజీ రావడం లేదు. పార్టీ పెట్టిన తర్వాత పట్టించుకోలేదు. దీనిపై షర్మిల కూడా బహిరంగంగా సెటైర్లు వేశారు. కానీ సాక్షిలో తనకూ వాటా ఉందని షర్మిల కొన్ని ఇంటర్యూలలో చెప్పిన తర్వాత.. ఏవో రాజీ చర్చలు జరిగాయని అనుకున్న తర్వాత ఆమెకు కొంత కవరేజీ ఇస్తున్నారు. ఇటీవల అది కూడా తగ్గిపోయిదని చెబుతున్నారు. మొత్తంగా షర్మిల ఫోటో రావడం ఇష్టం లేకనే ప్రకటన వేయలేదంటూ ఓ వ్యక్తి పోలీసుల ఫిర్యాదు వరకూ వెళ్లడం .. వైఎస్ కుటుంబంలో చిచ్చు అంతకంతకూ కార్చిచ్చు అవుతోందన్న అభిప్రాయం కలగడానికి కారణం అవుతోంది.