వైఎస్ వివేకా హత్య కేసు పరిణామాలు. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న చర్చల మధ్య వైఎస్ భారతిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు రావాలని సీఎం జగన్ నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగతోంది. జమ్మలమడుగు నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి చాలా ప్రతిష్టాత్మకమైంది. కడప స్టీల్ ప్లాంట్ ను జగన్ ఇక్కడే పెట్టిస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి వైఎస్ కుటుంబం మద్దతిచ్చిన అభ్యర్ధులు గెలిచినా మధ్యలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈసారి టీడీపీ అభ్యర్ధిగా ఆదినారాయణరెడ్డి నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలో ఉన్నా… పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. టీడీపీ అధినాయకత్వంతో టచ్లో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీలోనే ఉన్న రామసుబ్బారెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. జమ్మలమడుగులో అయితే ఆది నారాయణరెడ్డి లేకపోతే రామసుబ్బారెడ్డి అన్నట్లుగా రాజకీయం నడిచేది. కానీ ఇద్దర్నీ కాదని గత ఎన్నికల్లో సుధీర్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి లైన్ క్లియర్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అంతగా సీరియస్ గా తీసుకోవాల్సిన నేతగా వైసీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపైనా వ్యతిరేకత పెరుగుతోందని చెబుతున్నారు.
ఇటీవల జగన్ తన పార్టీ కూడా తనకు కాకుండా పోతుందన్న ఆందోళనలో ఉన్నారు. అందుకే శాశ్వత అధ్యక్షునిగా కూడా ప్రకటించుకున్నారు. ఏదో జరుగుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా భారతిని ఎమ్మెల్యేను చేయడమే మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో … వైఎస్ సునీత కుటుంబం రాజకీయంగా యాక్టివ్ అయితే మరింత ఇబ్బంది ఎదుర్కొంటారు. అన్నీ ఆలోచించే.. చివరికి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు.