శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులు కాసేపు నిలబడటానికే అక్కడి సిబ్బంది ఒప్పుకోరు. కెమెరాలను కూడా ఆలయంలోకి అనుమతించరు. అలాంటిది సింగర్ మంగ్లి ఏకంగా తన పాటను చిత్రీకరించుకున్నారు. ఎప్పుడు చిత్రీకిరంచుకున్నారు అనేదానిపై స్పష్టత లేదు. కానీ పాటలు మాత్రం యూట్యూబ్ లోకి వచ్చేశాయి. ఎలా చిత్రీకరించారో .. ఎప్పుడు చిత్రీకరించారు.. అసలు అనుమతి ఎవరిచ్చారు అన్నది తెలియకుండానే పాటలు బయటకు వచ్చాయి. కాళహస్తి ఆలయంలోకెమెరాల అనుమతిని ఇరవై ఏళ్ల కిందటే రద్దు చేశారు. ఎలాంటి చిత్రీకరణలకు అనుమతి ఇవ్వడం లేదు.
ముక్కంటి ఆలయంలోని స్వామివారి సన్నిధి నుంచి నటరాజస్వామి విగ్రహం వరకు మధ్యలో ఉన్న ప్రదేశంలో మంగ్లీ డాన్స్ చేసింది. అలాగే, ఆలయంలోని కాలభైరవస్వామి విగ్రహం వద్ద, అమ్మవారి సన్నిధి నుంచి స్పటిక లింగం వరకు మధ్యభాగంలోనూ గ్రూప్ డాన్స్ చేశారు. ఊంజలసేవా మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చే చోట మంగ్లీ మరో ఇద్దరు యువతులతోనూ స్టెప్పులు వేసింది. ఆ పక్కనే ఉన్న రాయలవారి మండపం, రాహుకేతు మండపంలలో కూడా చాలా సేపు వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
మంగ్లి వైసీపీ సానుభూతిపరురాలిగా ఉన్నారు. ఆ పార్టీ కోసం పని చేస్తూంటారు. ఇటీవల ఎస్వీబీసీ చానల్లో సలహాదారుపదవి ఇచ్చారు. నియామక ఉత్తర్వులు తీసుకున్న ఆరు నెలల ముందుతేదీ వేసి ఆపాయింట్ మెంట్ ఇచ్చారు. ఆ ప్రకారమే జీత భత్యాలిస్తున్నారు. ఇప్పుడు ఆలయాలను కూడా డాన్సుల కోసం ఆమెకు అప్పగించినట్లుగా వీడియోలు బయటకు వస్తున్నయి. దీనిపై కాళహస్తి ఆలయ అధికారులు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అనుమతులపై స్పందించడం లేదు. ఎవరి ఇష్టారీతిన వారు ఆలయాలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి.