టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అనూహ్యంగా టీవీ9 కొత్త ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. తన ఆడిటర్‌ను కొంత మంది పోలీసుల్ని భద్రతగా తీసుకుని టీవీ9 కొత్త కార్యాలయానికి వచ్చిన ఆయన నేరుగా లోపలికి వెళ్లిపోయారు. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ..బయటకు వచ్చిన తర్వాత ఆయన తాను టీవీ9 అకౌంట్స్ చెక్ చేయడానికి వచ్చానని మీడియాకు చెప్పి వెళ్లారు.
టీవీ9లో రవిప్రకాష్ కు ఇప్పటికీ వాటా ఉంది. ఆయన మైనార్టీ షేర్ హోల్డర్. ఎడెనిమిదిశాతం వరకూ వాటా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ భాగాన్ని ఆమ్మాలని ఆయనపై గతంలో చాలా ఒత్తిడి వచ్చినా.. అంగీకరించలేదు. టీవీ9 కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన తర్వాత రవిప్రకాష్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు మళ్లీ ఆయన హఠాత్తుగా టీవీ9 ఆఫీసులో ప్రత్యక్షం కావడం సంచలనంగానే మారింది.
ఇటీవలి కాలంలో టీవీ9 కొత్త యాజమాన్యానికి… తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు మధ్య చెడిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ మద్దతు కోల్పోవడంతో పాటు.. రవిప్రకాష్ తెలంగాణ ప్రభుత్వ పెద్దల సపోర్ట్ ను కూడా పొందారని చెబుతున్నారు. అందుకే ఆయన మైనర్ వాటాదారునిగా అకౌంట్స్ చెక్ చేసేందుకు తనకు అధికారం ఉందని.. ఆదేశాలు తెచ్చుకుని పోలీసు భద్రతతో టీవీ9 కార్యాలయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. క
కార్యాలయం లోపల ఆయనకు సిబ్బంది అకౌంట్స్ చూపించారా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికీ ఆయన మాజీ సహచరులు ఎడిటోరియల్ స్టాఫ్ గా ఉన్నారు. వారెవరైనా మళ్లీ పాత అనుబంధంతో పలకరించారా లేకపోతే కొత్త యజమాన్యానికి కోపం వస్తుందని ముఖం చాటేశారా అన్నది కూడా స్పష్టత లేదు. రవిప్రకాష్ టీవీ9 ఆఫీసుకు వెళ్లడం మాత్రం సంచలనంగా మారింది.