శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ శాసనసభ్యుడు కలమట వెంకట రమణమూర్తి తెలుగుదేశంలో చేరిపోవడం ఆ పార్టీ నాయకుడు జగన్మోహన రెడ్డికి ఎదురుదెబ్బే. తన వాళ్లను ఫిరాయించకుండా ఆపలేకపోతున్నారని దీంతో స్పష్టమై పోయింది. పకడ్బందీగా టిడిపి వీరిని తీసుకుపోతుంటే నివారించలేకపోతున్న జగన్ అవిశ్వాస తీర్మానం పెడతామని సంకేతాలు ఇవ్వడం ద్వారా వ్యూహాత్మక గందరగోళాన్ని వెల్లడించుకున్నారు. గతంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సంగతి తేలకుండానే ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అవిశ్వాసం తేవాలని ఆయన భావించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపై స్పీకర్ ఎలాటి వైఖరి తీసుకుంటారో చూడాలన్నది ఒకటైతే దీనిద్వారా జగన్పై ఆయన పార్టీ వారి విశ్వాసం పరీక్షించుకోదల్చుకున్నారని ఒకరు వ్యాఖ్యానించారు.
“నిజానికి ఇప్పటి వరకూ చేరినట్టు ప్రకటించిన వారంతా కొత్తగా మాకు టచ్లోకి వచ్చారు. మొదటే మాట్లాడుకున్నవారు ఇంకా అక్కడే వున్నారు,” అని వివరించారో తెలుగు దేశం నేత. మొత్తం సంఖ్య కనీసం 15 దాటొచ్చని కొన్ని పేర్లు నియోజకవర్గాలతో సహా వెల్లడించారు.
వీరంతా వూరికే రావడం లేదు.. ఏవో అవగాహనలు వుంటాయి కదా.. అని ఆయన అన్నప్పుడు “నేను పేమెంట్+ అగ్రిమెంటు” అంటే అవునంటూ బలపర్చారు. “స్వాభావికంగా జగన్ పైసా బయిటకు తీయరు. వీరంతా ఆయన గొప్పతనాన్ని నమ్ముకుని వుండాలంటే కుదిరేపనేనా? ఈ రోజు రాజకీయాల్లో బతకాలంటే ఎన్నెన్ని ఖర్చులుంటాయి?” అని ఆయన ప్రశ్నించారు. వాటిపై గతంలోనే అవగాహన కుదిరినవారు తర్వాత వస్తారని కొత్తగా ఆసక్తి చూపిన వారిని ముందు చేర్చుకుంటున్నామని వివరించారు.