ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని .. స్టార్ హోటళ్లలో కోట్లు ఖర్చు పెట్టి పారిశ్రామికవేత్తలకు విందు భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. పత్రికలకు ఫుల్ పేజీ ప్రకటనలు అదే పనిగా ఇస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితులు సజావుగా ఉన్నాయని చూపించేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. పెట్టుబడిదారులు రావాలంటే.. లా అండ్ ఆర్డర్‌తో పాటు వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అన్నదే చూసుకుంటారు. అరాచక వ్యవస్థ ఉంటే ఎవరూ రారు. కానీ ఓ వైపు పెట్టుడి దారులు రావాలంటూ ప్రచారం చేసుకుంటూ.. మరో వైపు ఏపీలో అరాచక వ్యవస్థ ఉందని చేతలతో చూపిస్తున్నారు. దీంతో రూ. కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటున్న ప్రచారం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది.
ఏపీలో రాజ్యాంగ వ్యవస్థల పనితీరుపై మొదటి నుంచి వివాదం ఉంది. ప్రభుత్వం చేసే నిర్ణయాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని వందల సార్లు కోర్టు కొట్టి వేసింది. ఇంత రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్న రాష్ట్రం ఏపీలో మరొకటి ఉండదు. కనీసం లా అండ్ ఆర్డర్ అయినా పక్కగా ఉంటుందా అంటే.. అదీ లేదు. పోలీసులు ఏకపక్ష తీరు … అధికార పార్టీల నేతలు ఏం చేసినా0 కేసులు ఉండకపోవడం.. వ్యతిరేక వర్గాలపై తప్పుడు కేసులు పెట్టడం.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి వాతావరణాన్ని పెట్టుబడిదారులు అసలు అంగీకరించరు.
అధికార పార్టీ కార్యకర్తలు ఇలా దాడులకు పాల్పడితే.. పోలీసులు అదుపు చేయలేకపోతే.. శాంతిభద్రతల సమస్య ఉందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తారు. ప్రజల్లో ఇలాంటి భయాందోళనలు ఏర్పడితే ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అందుకే అధికారంలో ఉండే రాజకీయ పార్టీలు చాలా సంయమనంతో ఉంటాయి. ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా వీలైనంతగా కామ్ గా ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి పరిణామాలు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. పాలనలో విఫలమయ్యారని.. లా అండ్ ఆర్డర్ ను కాపాడలేకపోయారని అంటారు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది.
స్వయంగా ముఖ్యమంత్రి కూడా తమ కార్యకర్తలకు బీపీ వస్తుందని చెప్పుకునేంత మనస్థత్వం ఉన్న వారు కావడంతో… అధికార ప్రేరేపిత అరాచకశక్తులకు కవచంగా మారిపోయింది. ఇది ఏపీకి తీవ్ర నష్టం చేస్తోంది.