ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు పలు వర్గాలతో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన ప్రతీ సారి పెద్ద ఎత్తున వరాలు ఇచ్చేవారు. వాటిలో కొన్ని మేనిఫెస్టోలో పెట్టారు. చాలా పెట్టలేదు. కానీ పెట్టినా పెట్టకపోయినా ఆయన అన్న మాటలు… ఇచ్చిన హామీలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిని పాదయాత్రలో లోకేష్ వెరైటీగా గుర్తు చేస్తున్నారు. అంతే కాదు… ఆ హామీల్ని తాము అమలు చేసి చూపిస్తామంటున్నారు. మంగళవారం పాదయాత్రలో చిత్తూరు జిల్లాలో ముస్లిం వర్గాలతో సమావేశం అయ్యారు. ఆయన ఇస్లామిక్ బ్యాంక్ ప్రస్తావన తీసుకు వచ్చారు. తాము రాగానే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇస్లామిక్ బ్యాంక్ అనగానే అందరికీ జగన్ ప్రకటనే గుర్తుకు వచ్చింది. పాదయాత్ర జగన్ ముస్లిం వర్గాలను ఆకట్టుకునేందుకు ఇచ్చిన అనేకానేక హామీల్లో ఇస్లామిక్ బ్యాంక్ కీలకం. కానీ అధికారంలోకి వచ్చాక షాదీ తోఫా, విదేశీ విద్య వంటి పథకాలను కూడా మూడున్నరేళ్ల పాటు రద్దు చేసి…ఇటీవల అసలు అర్హులే ఉండని విధంగా పథకాల నిబంధనలు పెట్టి అమలు చేస్తున్నారు. ఇస్లామిక్ బ్యాంక్ అనే ఆలోచన కూడా చేయలేదు. ఐదు లక్షలు వడ్డీ లేని రుణం అని ఆశపెట్టారు. తాము మోసపోయామని ముస్లిం వర్గాలు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాయి. ఈ ఆగ్రహాన్ని లోకేష్ పకడ్బందీగా ఉపయోగించుకుంటున్నారు. తాము రాగానే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామంటున్నారు.
ఇతర వర్గాల విషయంలోనూ లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ ఇచ్చి మర్చిపోయిన హామీల్నే హైలెట్ చేస్తున్నారు. జగన్ మోసం చేశారని.. తాను న్యాయం చేస్తానని చెబుతున్నారు. లోకేష్ స్ట్రాటజీ రెండు విధాలుగా వర్కవుట్ అవుతోందని అంటున్నారు. ఒకటి జగన్ మోసం చేశారనే విషయం గుర్తు చేయడం.. మరొకటి.. టీడీపీ వస్తే చేస్తుందని నమ్మకం కలిగించడమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయా వర్గాల నుంచి మంచి స్పందన రావడంతో ఈ స్ట్రాటజీకి టీడీపీ నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.