హిజ్రలు తన అక్కచెల్లెళ్లు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. వారికి బాధ కలిగి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నానని ప్రకటించారు. దీనికి కారణం మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా హిజ్రాలు షర్మిలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఆమె ఫ్లెక్సీలను చెప్పుతో కొడుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను విమర్శించే క్రమంలో హిజ్రాలను ఉదాహరణగా చూపిస్తే షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి.. పాదయాత్రకు అనుమతులు రద్దు చేసి హైదరాబాద్లో విడిచి పెట్టారు.
ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ఉండటంతో హిజ్రాలు వైయస్ షర్మిల తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైయస్ షర్మిల తక్షణం తమకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హిజ్రాలను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని, హిజ్రాలలో చదువుకున్న వారు, విద్యావంతులు, మేధావులు ఎందరో ఉన్నారని, హిజ్రాలు నేడు సమాజంలో మిగతా కమ్యూనిటీలలానే గౌరవప్రదంగా జీవిస్తున్నారని హిజ్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లైలా ప్రకటించారు. హిజ్రాల గురించి మాట్లాడేటప్పుడు వారి జీవితం ఏంటో వారితో కలిసి ఉండి తెలుసుకోవాలని, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ కొజ్జా.. కొజ్జా అంటూ తమ కమ్యూనిటీని కించపరిచి మాట్లాడితే ఊరుకునేది లేదని హిజ్రాలు హెచ్చరించారు. ఈ నిరసనలు అంతకంతకూ పెరుగుతూండడటంతో షర్మిల బేషరతుల క్షమాపణలు చెప్పారు. అంతేకాదు… వైఎస్ఆర్ టీపీ అధికారంలోకి వస్తే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు.. వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఉచిత ఆఫర్లు కూడా ఇచ్చేశారు. ఇకనైనా షర్మిల విషయంలో హిజ్రాలు సంతృప్తి పడతారేమో చూడాలి.