తెలంగాణ సీఎం కేసీఆర్ అందుబాటులో ఉన్న ముఖ్యులతో ఎమర్జెన్సీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్లానింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ దామోదర్‌రావులతో పాటు ఇద్దరు ముగ్గురు సీనియర్ లీడర్లతో రోజంతా చర్చలు జరిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్న హరీశ్‌రావుకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ అర్జెంట్‌గా ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. దీంతో ఆయన పర్యటన క్యాన్సిల్ అయింది. చందనవెల్లిలో వెల్స్పన్ ఇండస్ట్రీ ఓపెనింగ్ పూర్తికాగానే కేటీఆర్ కూడా సమావేశానికి హాజరయ్యారు.
సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ పార్టీ వర్గాలుగానీ.. సీఎంవో అధికారులుగానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, ఎలక్షన్ ఏడాది కావడంతో ప్రభుత్వ ప్రధాన హామీలైన రైతుబీమా, సొంత జాగాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, దళితబంధు వంటి వాటిపై చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల పెర్ఫార్మెన్స్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉండొచ్చనేది సీఎం కేసీఆర్ నేతలను అడిగి తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు.
కర్ణాటకతో పాటు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని.. నెలాఖరులోపు అసెంబ్లీని రద్దు చేస్తే అలా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే హై లెవల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని.. అందరూ ఓకే అంటే..కేసీఆర్ తన నిర్ణయాన్ని వేగంగా అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. గురువారం కూడా ఇలాంటి సమావేశాలు కొనసాగిస్తే.. కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.