మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిస వచ్చిన కన్నా .., టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కన్నా లక్ష్మినారాయణతో పాటు ఆయన అనుచరులు దాదాపుగామూడు వేల మంది టీడీపీ ఆఫీస్కు తరలి వచ్చారు. ముఖ్య నేతలందరికీ చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ స్థానిక నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కన్నా గత వారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఏపీ రాజకీయాల్లో కన్నా లక్ష్మినారాయణకు ప్రత్యేకమైన స్థానం ఉందని చంద్రబాబు ప్రశంసించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారని.. ఆయనను విభిన్నమైన పదవుల్లో చూశానన్నారు. సిద్ధాంతం కలిగిన రాజకీయ నేతల్ల ోఆయన కూడా ఒకరన్నారు. హుందాతనం, పద్దతి కలిగిన కన్నా లక్ష్మినారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం శుభపరిణామమని.. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుత సీఎం మాత్రం మొత్తం విధ్వంసమే ఆయుధంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ది ఎంత ఎంత క్రూరమైన మనస్థత్వమో ప్రజా వేదిక కూల్చివేతతోనే అర్థమయిందన్నారు. ఏపీకి ఇంత నష్టం చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో లేరని చంద్రబాబు అన్నారు.
–
ఏపీలో రాక్షస పాలన సాగుతోందని కన్నా లక్ష్మినారాయణ అన్నారు. రాక్షస పాలనను అంతం చేందుకు రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వాదులందరూ కలిసి రావాలని కన్నా పిలుపునిచ్చారు. తాను టీడీపీలో చేరడంపై చాలా మందికి సందేహాలు రావొచ్చన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం గురించి ఈ ముఖ్యమంత్రి ఆలోచించడం లేదని ఆరోపించారు. మనందరి తలలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి గొప్పులు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ రాక్షసులను రాష్ట్రం నుంచి తరిమికొడితే్ తప్ప రాష్ట్రానికి భవిష్యత్ ఉండదన్నారు.
కన్నా చేరిక కార్యక్రమానికి గుంటూరు జిల్లా టీడీపీ నేతలందరూ హాజరయ్యారు. దశాబ్దాలుగా గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కన్నా .. టీడీపీ నేతలకు ప్రత్యర్థిగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే సరైన చాయిస్ అని అనుకోవడంతో టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు కూడా స్వాగతించారు. గుంటూరులో ఓ బలమైన కాపు నేత కొరత టీడీపీకి ఉండటంతో ఆ కొరత కన్నా తీరుస్తారని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు.