గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను అధికార, ప్రతిపక్ష నేతలు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన సీఎం జగన్.. తర్వాతి రోజు అంటే గురువారం రాజ్ భవన్ కు వెళ్లారు. మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఆయనతో పాటు వెళ్లిన వైఎస్ భారతి రెడ్డి .. జస్టిస్ అబ్దుల్ నజీర్ భార్యకు ఖరీదైన చీరలను బహుమతిగా ఇచ్చారు. వారు మాట్లాడి వెళ్లిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గవర్నర్ ను కలిశారు. టీడీపీ ముఖ్య నేతలందరితో వెళ్లిన ఆయన.. పరిచయాలయ్యాక… జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో 40 నిమిషాల సేపు ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో నలభై నిమిషాలు చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడటంతో వైసీపీ వర్గాల్లోనూ దీనిపై చర్చ ప్రారంభమయింది. ఏం మాట్లాడి ఉంటారని వారు అంతర్గతంగా సమాచారం సేకరిస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల గురించి కాకుండా రాష్ట్రంలో పరిస్థితుల గురించి వివరించారని చెబుతున్నారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం పోలీసుల్ని అడ్డు పెట్టుకుని ఎలా హరించి వేస్తుందో … కొన్ని ఘటనలను వివరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసి ఉన్నందున జస్టిస్ అబ్దుల్ నజీర్ కు సామాన్యంగా చట్ట ఉల్లంఘనలను సహించరు. అయితే.. చంద్రబాబు అన్నీ మాటల ద్వారానే చెప్పారని ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వలేదని అంటున్నారు.
హఠాత్తుగా గవర్నర్ ను ఎందుకు మార్చారో కానీ.. దానికో మోటివ్ ఉంటుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పరిస్థితులు రానురాను దిగజారుతూండటం ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని నమ్మకం లేకపోవడంతో పాటు… ప్రభుత్వ బెదిరింపులు.. పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి దాసోహం అవడం వంటివి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన గవర్నర్ చంద్రబాబుతో ఎక్కువ సేపు మాట్లాడటం పై వైసీపీ వర్గాల్లోనూ టెన్షన్ కనిపిస్తోంది.