ఏపీ ప్రభుత్వానికి ఏదైనా అంశంలో డైవర్షన్ కావాలంటే ముందుగా మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సోదాలు చేయడం మాత్రమే కనిపిస్తోంది. అమరావతి భూముల కేసులో ఇప్పటికి నారాయణ ఇంట్లో ఎన్ని సార్లు సోదాలు చేశారో లెక్కలేదు. అయినా మరోసారి ఆయన ఇంటిపై పడ్డారు సీఐడీ అధికారులు. వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలోనే హైలెట్ అయ్యేలా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో నారాయణకు చెందిన ఇళ్లకు వెళ్లారు. గతంలో నారాయణ ఇంట్లో సోదాలు చేశారు కాబట్టి ఈ సారి వెరైటీగా నారాయణ కుమార్తె ఇళ్లల్లో సోదాలు అని ప్రచారం ప్రారంభించారు.
వాస్తవానికి నారాయణ ఇళ్లే నారాయణ కుమార్తె ఇళ్లు. అయినప్పటి కీ సోదాలు చేయడానికి ఇలా చెప్పుకున్నారు. రెండు రోజుల క్రితమే… నారాయణపై నమోదు చేసిన అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ కేసుల్లో ఎలాంటి దుందుడుకు చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే సోదాలు చేసుకోవద్దన లేదు కదా అనుకున్నారేమో కానీ వచ్చేశారు. గతంలో నారాయణ కాలేజీల హెడ్ ఆఫీస్ పైనా దాడి చేసి.. విద్యార్థుల జాబితాను తీసుకెళ్లారు.
తర్వాత సాక్షి పత్రికలో.. పెద్ద ఎత్తున డబ్బు లావాదేవీలనీ.. అదనీ ఇదనీ రాశారు. కానీ ఒక్క ఆధారాం కూడా ప్రకటించలేదు. కనీసం కోర్టుకు కూడా చెప్పలేదు. ఏదో విధంగా నారాయణను వేధించి పార్టీలో చేర్చుకోవడం లేదా.. వివేకా హత్య కేసులో మీడియా ప్రచారాన్ని డైవర్ట్ చేయడానికి సీఐడీ ఈ తంటాలు పడుతోంది. కానీ ఇప్పటికే సీఐడీ వ్యవహారాలపై ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత కనిపిస్తోంది. ఏం చేసినా ప్రతీకారమే అన్నట్లుగా భావిస్తున్నారు.