రెండో సారి విచారణకు పిలిచిన తర్వాత హైకోర్టులో సీబీఐ వేసిన ఓ కౌంటర్లో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఎంత పకడ్బందీగా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారో తెలిసేలా సీన్ టు సీన్ వివరించారు. ఆ తర్వాత సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఆయనను ఇక అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఐదు గంటల పాటు ప్రశ్నించి ఆయనను పంపేశారు. దీంతో అరెస్ట్ ఎప్పుడు అనుకుంటూ ఆయన టెన్షన్ గా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీబీఐ విచారణ తర్వాత బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి అసహనంగా కనిపించారు. మీడియా దుష్ప్రచారం చేస్తోందని.. విచారణలో ఉన్న కేసు విషయంలో బాధ్యతగా ఉండాలని సుద్దులు చెప్పారు. అదే సమయంలో ఆయన మాత్రం… చాలా విషయాలు మాట్లాడారు. ఓ అబద్దాన్ని సున్నా నుంచి వందకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అంతే కాదు సీబీఐ మీదే నిందలు వేశారు. రూ. 40 కోట్ల డీల్ అంటూ…ఏడాది కిందట టీడీపీ చేసిన ఆరోపణల్ని సీబీఐ కౌంటర్ లో వేసిందని చెప్పుకొచ్చారు. అసలు వివేకా చనిపోయే ముందు రాసిన లేఖ ఎక్కడ ఉందని.. దాన్ని బయటకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. అవన్నీ సీబీఐ అధికారులు చూసుకుంటారనే సంగతిని మర్చిపోయారు.
మొదటి సారి విచారణ జరిగినప్పుడు కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించారు. ఆ సమయంలో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిల పీఏలకు ఫోన్ చేసినట్లుగా తెలిపారు. దీంతో వారినీ సీబీఐ విచారించింది. శుక్రవారం నాటి విచారణలో బ్యాంక్ లావాదేవీలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ను ప్రస్తావిస్తూ అవినాష్‌ను విచారిస్తున్నరని అంటున్నారు. ఈ కేసులో అసలు సూత్రధారులెవరో తేల్చేలా కేసు విచారణ సాగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదంటున్నారు. మొత్తంగా వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.