తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ముందూ వెనుకా చూసుకోని రాజకీయాలు చేస్తున్నారు. ఎన్ని సార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైనా ఆయన తీరు మారదు. తాజాగా ఆయన మరోసారి లవ్ జీహాద్ అనే కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారు. దీంతో అందరూ ఆయన్ను విచిత్రంగా చూస్తున్నారు. వరంగల్ మెడికల్ కాలేజీలో చదువుకున్న ప్రీతి అనే మెడికో ఆత్మహత్యాయత్నం చేసింది. దానికి కారణం సైఫ్ అనే సీనియర్ స్టూడెంట్ అనే ఆరోపణలు వచ్చాయి. వేధించారన్నదానికి సాక్ష్యాలు లభించడంతో పోలీసులు సైఫ్ ను అరెస్ట్ చేశారు.
అయితే ఇక్కడ ప్రేమ అనే కోణం లేదు. కానీ సైఫ్ అనే పేరు కనిపించడం.. ప్రీతి అనే అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఇదేదో బాగుందని బండి సంజయ్ లవ్ జీహాద్ అనేశారు. ఇది రాగింగ్ అండ్ లవ్ జీహాద్ కేసని తేల్చేశారు. హిందు అమ్మాయిలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని … నిందితుడు బయట ఉంటే కొడతారని చిన్న కేసు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. దీని వెనక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ అటెంప్ట్ వెనక సీనియర్ వేధింపులే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నా.. దీన్ని చిన్న కేసుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రీతి కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ అంటున్నారు.
రాజకీయాలు చేయవచ్చు కానీ.. ఇలా ప్రతీ దానికి మతానికి .. లవ్ జీహాద్ అంటూ లింక్ పెట్టి మాట్లాడితే కొన్ని వర్గాల ప్రజలను కించ పరిచినట్లవుతుంది. వారు కూడా భారతీయులే. ఓ వర్గం వారయినంత మాత్రాన.. ప్రతీది జీహాద్ లా చేస్తారని అనుకుంటే వారిని విడగొట్టడమే అవుతుంది. అసలు ప్రీతి ఇష్యూలో ప్రేమ అనే కోణం లేకపోయినా తీసుకు వచ్చి .. ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆమెను.. ఆమె కుటుంబాన్ని కూడా బండి సంజయ్ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.