హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఆర్ ఆర్ ఆర్ హవా కొనసాగింది. ఈ వేడుకలో ప్రజెంట్ గా రాంచరణ్ మెరిశారు. యూఎస్ కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకలో 4 అవార్డులను సాధించి ఆర్ఆర్ఆర్ టీం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’ అవార్డును కైవసం చేసుకుంది. HCA అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డుతో పాటు మరో మూడు అవార్డులను కూడా ఆర్ ఆర్ ఆర్ గెలుచుకుంది. ఆర్ ఆర్ ఆర్- ‘ఉత్తమ యాక్షన్ చిత్రం’, ‘ఉత్తమ స్టంట్స్’ మరియు ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో అవార్డులు గెలిచి సత్తా చాటింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగానికి సంబంధించిన అవార్డు కీరవాణి అందుకోగా, ఉత్తమ స్టంట్ మరియు ఉత్తమ యాక్షన్ చిత్రం అవార్డులను రాజమౌళి అందుకున్నారు. ఆ సందర్భంగా సినిమాకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లను అభినందించి అంతర్జాతీయ వేదికపై వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు ను రాంచరణ్ మరియు రాజమౌళి కలిసి సంయుక్తంగా అందుకున్నారు. అవార్డు అందుకున్న తర్వాత రామ్ చరణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తాను స్టేజ్ పైకి వస్తానని అనుకోలేదని, డైరెక్టర్ నన్ను తనతో పాటు రమ్మని చెప్పాడు కాబట్టి అనుకోకుండా ఈ అవార్డు తీసుకోవడానికి వేదిక మీదకు వచ్చానని, అని చెబుతూ అవార్డు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు . మరిన్ని మంచి చిత్రాలతో తిరిగి వచ్చి మీ అందరినీ అలరిస్తానని హామీ ఇచ్చారు. దీంతోపాటు ప్రెజెంటర్ గా కూడా రామ్ చరణ్ ఈ వేడుకలో మెరిశారు. ఉత్తమ ఫిమేల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టు అవార్డును ప్రకటించడమే కాకుండా విజేతకు అవార్డు కూడా తన చేతుల మీదుగా అందించారు.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ సాధించిన ఈ విజయంతో అభిమానులకు ఆస్కార్ పై కూడా ఆశలు చిగురించాయి. మరి నిజంగా ఆస్కార్ కూడా నాటు నాటు పాట సాధిస్తుందా అన్నది వేచి చూడాలి.