వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని అదే పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తమ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన అంటున్నారు. ఇటీవల ప్లీనరీలో శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమిస్తూ తీర్మానం చేశారని..కానీ అది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదన్నారు. తర్వాత ఈ అంశాన్నివెనక్కి తీసుకుంటున్నట్లుగా చెప్పారు కానీ.. మళ్లీఅధ్యక్ష పదవి నిర్వహించలేదన్నారు. ఒక వేళ నిర్వహించకపోతే తమ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన ఈసీకీ రాసిన లేఖలో పేర్కొన్నారు.
పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయలేదుకాబట్టి.. ఎన్నికలు నిర్వహిస్తే తాను వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని రఘఉరామచెబుతున్నారు. తమ పార్టీ వైఎస్ఆర్సీపీనా లేకపోతే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనా అనేది క్లారిటీ లేదని.. దీనిపైనా స్పష్టత ఇవ్వాలని కోరారు. గతంలో ఈ అంశంపై రఘురామ కోర్టుకెళ్లారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు తమ లెటర్ ప్యాడ్ల మీద యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేరు మార్చారు.
ఇప్పుడు ఏకంగా పార్టీ గుర్తింపురద్దు చేయాలని ఆయన ఈసీ దగ్గర పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. పార్టీని ధిక్కరించినప్పటికీ రఘురామపై చర్యలు తీసుకోవడానికి వైసీపీ నేతలు సిద్ధంగా లేరు. దీంతో ఆయన దీన్నే అడ్వాంటేజ్‌గా చేసుకుని మరిన్ని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ గుర్తింపు మీదే గురి పెట్టారు. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో మరి !