ఏదైనా దర్యాప్తు సంస్థ ఇళ్లలో సోదాలు చేస్తే కీలకమైన పత్రాలు దొరికాయంటా లేదా.. క్యాష్ దొరికిందంటారు.. కానీ విచిత్రంగా ఏపీ సీఐడీ మాత్రం నారాయణ, ఆయన కుమార్తె ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఆడియో క్లిప్ దొరికిందని చెబుతోంది. అంతే.. ఆ ఆడియో క్లిప్ ను అసలు ఇంకా సోదాలు ముగియక ముందే మీడియాకు కూడా అందించేసింది. ప్రో వైసీపీ మీడియా ఆ ఆడియో క్లిప్ ఇదేనంటూ ప్రచారం కూడా చేసేస్తున్నాయి. ఇక సాక్షి గురించి చెప్పాల్సిన పని లేదు. అసలు ఈ ఆడియో క్లిప్ నిజమైనదా కాదా.. అందులో నేరం ఉంటే సాక్ష్యంగా ఉపయోగపడాలంటే ముందుగా మీడియాలో వస్తే ఎలా ఉపయోగపడుతుంది వంటి అంశాలను పట్టించుకోలేదు కానీ ప్రచారం చేసేస్తున్నారు.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి విచారణ… అనంతర పరిస్థితులతో టీడీపీపై ఏదో ఒకటి చేయాలన్న కసితో.. సీఐడీని ప్రయోగించినట్లుగా స్ఫష్టంగా కనిపిస్తోంది. గతంలో సోదాలు చేసిన దగ్గరే మళ్లీ సోదాలు చేసి ఓ ఆడియో క్లిప్ ను బయట పెట్టి ఇది ఆ ఇంట్లోనే దొరికిందని మనీ రూటింగ్ ఎలా చేయాలో అందులో ఉందని చెబుతున్నారు. అమరావతి బినామీ భూములు కొనుగోలు చేశారన్న కేసుకు.. ఈ ఆడియో క్లిప్ కు ఏమిటో సమాధానం సీఐడీనే చెప్పాలి. కానీ ముందే సాక్షి సహా అన్ని మీడియాలకు ఈ ఆడియోను లీక్ ఎందుకు చేశారో కూడా సీఐడీకే తెలియాలి. కోటంరెడ్డి ఫోన్ ను ట్యాప్ చేసినట్లుగా నారాయణ ఫ్యామిలీ ఫోన్లను ట్యాప్ చేసి.. దీన్ని లీక్ చేసి.. ఈ ఆడియో క్లిప్ సోదాల్లో దొరికిందని చెబుతున్నట్లుగా ఉందన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. అయితే దర్యాప్తు అధికారులు వారే కాబట్టి … అసలు నిజం బయటకు రాదు.
అమరావతి భూములపై ఎన్ని కేసులు పెట్టారో.. ఎన్ని విచారణలు చేయిస్తున్నారో కానీ ఇంత వరకూ ఫలానా వారి భూమిని బినామీలుగా కొన్నారనే విషయాన్ని వెల్లడించలేదు. కనీసం ఒక్కరంటే ఒక్క బాధిత రైతు కూడా లేరు. ఫిర్యాదు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డితో చేయించి అట్రాసిటీ కేసులు పెట్టారు. స్పష్టంగా తప్పుడు కేసులు అని తెలుస్తున్నా… పదే పదే సోదాల పేరుతో నారాయణ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారని టీడీపీ నేతలంటున్నారు. ఇప్పుడు తమకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే టీడీపీపై దుష్ప్రచారం చేయాడనికి సీఐడీని సోదాల పేరుతో రంగంలోకి దింపుతున్నారని అంటున్నారు. కొద్ది రోజుల కిందట నారాయణ ఇంట్లో సోదాలు చేసినప్పుడు కూడా ఇలాగే.. ప్రచారం చేశారు. కానీ దొరకిదేమీ లేదనితర్వాత సైలెంట్ అవడంతోనే తేలిపోయిందని అంటున్నారు.