తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరో భారీ బహిరంగసభ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సారి టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ సభను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. తెలుగుదేశం పార్టీని హైదరాబాద్‌లోనే ప్రారంభించారు. అందుకే హైదరాబాద్‌లోనే వ్యవస్థాపక దినోత్సవాన్ని భారీగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బహిరంగసభకు చంద్రబాబు కూడా హాజరు కానున్నారు.
తెలుగుదేశం పార్టీ ఇటీవలి కాలంలో తెలంగాణలో స్తబ్దుగా ఉంది. అయితే కాసాని జ్ఞానేశ్వర్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత కదలిక వచ్చింది. ఖమ్మం సభను అనుకున్నదాని కన్నా ఎక్కువగా విజయవంతం చేసుకున్నామని టీడీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు. ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీకి బలం ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. కనీసం నలబై నియోజకవర్గాల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ , ఖమ్మం నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాంతాల్లో సభల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
తెలంగాణలో టీడీపీ రాజకీయాలు.. ఏపీలోనూ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో తెలుగుదేశం పార్టీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో టీడీపీ ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటుందా అన్న చర్చ ఇప్పటికే జరుగుతోంది. అయితే టీడీపీ మాత్రం ఎవరితో పొత్తులు ఉండవని చెబుతోంది. బీజేపీ కూడా ఎలాంటి పొత్తులు ఉండవని ప్రకటించింది. మరో వైపు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ ఏపీలోనూ శాఖను ప్రారంభించారు. త్వరలో ఏపీలో బహిరంగసభ పెట్టాలనుకుంటున్నారు. దీంతో టీడీపీ తెలంగాణలో మరింత చొచ్చుకెళ్లేందుకు అవకాశం లభించినట్లవుతోందని అంటున్నారు.