ఏపీ బీజేపీలో పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి సోము వీర్రాజు వెళ్లిపోతున్నారు. తాజాగా ఆయనపై ఫిర్యాదు చేయడానికి పలువురు నేతలు ఢిల్లీ వెళ్లారు. వారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే… ఇంచార్జ్ మురళీధరన్ ఏపీకి వచ్చారు. అది కూడా రాజమండ్రికి వచ్చారు. కానీ ఆ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం కడప పర్యటనలో ఉండిపోయారు. ఎప్పుడైనా ఇంచార్జ్ వస్తే.. స్వయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేసేవారు. కానీ ఈ సారి మాత్రం ముఖం చూపించలేకపోయారు.
బీజేపీలోని నాయకులు తమ స్వరాన్ని బాగా పెంచుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు దారా సాంబయ్య పార్టీలో దళితులకు, మైనార్టీలకు ఏ మాత్రం ప్రాముఖ్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నూతన కమిటీ నియామకంతో అసంతృప్తి జ్వాలలు మరింత పెరిగాయి. ఇక్కడ ఏకపక్ష ధోరణిలో పదవులు జరిగాయని, ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అడబాల రామకృష్ణారావు తన పదవికి రాజినామా చేశారు. ఇదిలా ఉంటే ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కాక అటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రస్తుతం బీజేపీ నాయకత్వం రెండు వర్గాలుగా చీలి అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందన్న మాటలు వినిపిస్తున్నాయి.
.
రాజమండ్రిలో పార్టీ సమావేశం నిర్వహించిన ఏపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్‌కు అనేక ఫిర్యాదులు పార్టీ శ్రేణుల నుంచి వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల నుంచి కూడా రాజమండ్రికి పలువురు నేతలు వచ్చి రాష్ట్ర నాయకత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపైనే అనేక ఆరోపణలు చేస్తూ వచ్చిన ఫిర్యాదులు అని తెలుస్తోంది. అయితే వీర్రాజుకు మద్దతుగా మరికొంత మంది నాయకులు వచ్చి మురళీధరన్‌కు పలు ఆర్జీలు సమర్పించారు. సోము వీర్రాజు వ్యవహారం ఆ పార్టీ హైకమాండ్ ను కూడా ఆగ్రహానికి గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.