ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఉదయం నుంచి ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఫిబ్రవరి 19న హాజరుకావాలని సీబీఐ ఆయనకు సమన్లు పంపింది. సిసోడియాకు ఆర్థిక శాఖ కూడా ఉంది. కాబట్టి బడ్జెట్ సన్నాహాలను ఉటంకిస్తూ మునుపటి తేదీకి హాజరుకాలేమని అతను తన అసమర్థతను వ్యక్తం చేశాడు. దీని తర్వాత సీబీఐ ఆయనకు ఆదివారం రావాలని ఆదేశించింది.
సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్ట్ చేస్తుందని సీఎం కేజ్రీవాల్ ఇంతకు ముందే ప్రకటించారు. విచారణకు వెళ్లే ముందు సిసోడియా కూడా.. సీబీఐ అరెస్ట్ చేస్తుందని కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి రావొచ్చని ట్వీట్ చేశారు. సిసోడియాకు సన్నిహితుడిగా భావిస్తున్న దినేష్ అరోరా అప్రూవర్‌గా మారడం ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనంగా మారింది. మద్యం వ్యాపారులకు లైసెన్సులు ఇచ్చే ఢిల్లీ ప్రభుత్వ విధానం వల్ల కొంతమంది డీలర్లు లబ్ధి పొందారని, ఈ డీలర్లు తమ ఇష్టానుసారం పాలసీని తయారు చేసుకునేందుకు లంచాలు ఇచ్చారని ఆరోపించారు. మనీష్ సిసోడియాకు ఢిల్లీ ఎక్సైజ్ శాఖ కూడా ఉంది, ఆయనే ఈ మొత్తం వ్యవహారం చక్కబెట్టారని అంటున్నారు.
‘సౌత్ లాబీ’ సభ్యులు, రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారుల విచారణలో లభించిన సమాచారం ఆధారంగా సీబీఐ సుదీర్ఘంగా ప్రశ్నించిన తరవాత సిసోడియాను అరెస్ట్ చేసింది. సౌత్ లాబీలో కూడా దాదాపుగా అందర్నీ అరెస్ట్ చేశారు. అరుణ్ రామచంద్ర పిళ్లైతో పాటు ఎమ్మెల్సీ కవిత మాత్రమే బయట ఉన్నారు. కవిత పై సాక్ష్యాధాలు ఉన్నాయని కోర్టు కూడా వ్యాఖ్యానించింది. దీంతో తదుపరి అరెస్ట్ కవితనే కావొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే సీబీఐ ఇప్పటికి ఓ సారి విచారణ జరిపింది.. రెండో సారి విచారణకు నోటీసులు జారీ చేసింది కానీ.. తేదీ చెప్పలేదు. ఖచ్చితంగా ఆమెకు నోటీసులు జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.