సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ మరో హీరో. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తున్నారు. నిజానికి… ముందు సంభాషణల బాధ్యత బుర్రా సాయిమాధవ్‌కి అప్పగించారు. చివర్లో పేర్లు మారిపోయి… ఆ బాధ్యత కూడా త్రివిక్రమే తీసుకొన్నారు. బుర్రా రాసిన డైలాగులు త్రివిక్రమ్‌కి నచ్చలేదని, అందుకే.. ఆయన్ని పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బుర్రాకి పారితోషికం కూడా సెటిల్ చేసేశారని చెప్పుకొంటున్నారు.
నిజానికి జరిగిన కథ వేరు. ముందు నుంచీ ఈ సినిమాకి త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తే బాగుంటుందని పవన్, సముద్రఖని భావించారు. కానీ.. త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబు సినిమాని దృష్టిలో ఉంచుకొని, వర్క్ ప్రెజర్ ఎక్కువైపోతుందన్న భయంతో ‘నో’ చెప్పారు. ఆయనే బుర్రా సాయిమాధవ్ పేరు సూచించారు. సముద్రఖని ‘వినోదయ సీతమ్’ కథలో చిన్న చిన్న మార్పులు చేసి ట్రీట్మెంట్ బుర్రా చేతిల్లో పెట్టారు. ఆయన… నెల రోజుల్లోనే తన డైలాగ్ వెర్షన్ మొత్తం పూర్తి చేశారు. అది త్రివిక్రమ్, సముద్రఖనిలకు కూడా బాగా నచ్చింది. ఇదే.. ఫ్లోలో ప్రొసీడ్ అయిపోదాం అనుకొన్న దశలో.. షూటింగ్ ఆలస్యమైంది. ఈలోగా.. కథలో త్రివిక్రమ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ కథలో పవన్ ప్రాధాన్యత తగ్గి, సాయిధరమ్ తేజ్ పాత్రకు వెయిటేజీ పెరిగిందన్న అనుమానాలు వచ్చాయి. దాంతో.. కథని త్రివిక్రమ్ తన సొంత స్టైల్ లో మార్చుకురావడం మొదలెట్టారు. పవన్ పాత్రని ఎలివేట్ చేస్తూ.. ఆయన సీన్లు పెంచుకొంటూ వెళ్లారు. తీరా చూస్తే 60కి 60 సీన్లూ మారిపోయి, కొత్త వెర్షన్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కి మాటలు రాయమని.. బుర్రాకి పిలుపొచ్చింది. ఆయనకు ఇచ్చింది కూడా చాలా తక్కువ సమయం. ఫలానా డేట్ లోగా.. డైలాగ్ వెర్షన్ పూర్తి చేసి ఇవ్వాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఆల్రెడీ ఓ వెర్షన్‌కి పూర్తి స్థాయిలో మాటలు రాసిచ్చిన బుర్రాకు… అది నచ్చలేదు. పైగా ఆయన చేతిలో చాలా సినిమాలున్నాయి. దాంతో… ‘ఇప్పటికిప్పుడు రాసివ్వడం కుదరదు’ అని ఆయన సున్నితంగానే చెప్పారు. ఓ రచయితగా తోటి రచయిత పరిస్థితిని అర్థం చేసుకొన్న త్రివిక్రమ్ కూడా.. ఈ వ్యవహారాన్ని చాలా సామరస్యపూర్వకంగానే పరిష్కరించారు. కథలో సడన్‌గా వచ్చిన మార్పులకు, చేర్పులకు రచయిత బాధ్యత ఎలా వహిస్తాడు అనే ఉద్దేశంతో.. సంభాషణల బాధ్యతని సైతం తానే తీసేసుకొన్నాడు. ఇది వరకే.. అంటే బుర్రా ఫైనల్ వెర్షన్ ఇచ్చే సమయానికే పారితోషికాలు సెటిల్ అయిపోయాయి. మా సినిమాకి పని చేయడం లేదు కదా.. డబ్బులు వెనక్కి ఇచ్చేయండి అని నిర్మాతలూ అడగలేదు. బుర్రా కూడా వెనక్కి ఇవ్వలేదు. అంతే.