బీఆర్ఎస్ సీనియర్ నేతలు వారసుల కోసం తమ డిమాండ్లను కేసీఆర్ ముందు పెడుతున్నారు. బీఆర్ఎస్ లో చాలా మంది నేతలు టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు. వాళ్లంతా సీనియర్లు అయిపోయారు. ఎక్కువ మంది తాము ఎన్నికల బరి నుంచి విరమించుకుని తమ వారసులకు చాన్సివ్వాలని కోుతున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు కుమారులు పోటాపోటీ రాజకీయం చేస్తున్నారు. ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని ఆయన కేసీఆర్ వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు. అనేక నియోజకవర్గాల్లో ఇపుడు మంత్రులు, ఎమ్మెల్యేల వారసులు ప్రచార భారం, పనులు, పార్టీ కార్యక్రమాలన్నీ తమ భుజాల మీద వేసుకుని పనిచేస్తున్నారు.
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడి కోసం మెదక్ అసెంబ్లిపై దృష్టిపెట్టారు. మెదక్ టిక్కెట్ రేసులో ఆయనుంటారని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. మైనంపల్లి టీడీపీలో ఉన్నప్పుడు మెదక్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు , ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్ , గుత్తా సుఖేందర్‌రెడ్డి .. ఇలా అనేక మంది తమ వారుసుల కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కుమార్తె కావ్య బరిలో నిలిచేందుకు రెడీగా ఉన్నారు.
కేటీఆర్ కూడా కేసీఆర్ వారసత్వం… తీసుకుని సీఎం పదవి చేపట్టబోతున్నారని భావిస్తున్నారు. అందుకే యువనేతలంతా… కేటీఆర్‌తో ఎక్కవగా సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకర్గాల్లో తమకు సానుకూలత ఉందని.. నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎంత మంది వారసులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారనుంది.