తాడేపల్లి నుంచి తెనాలి ఎంత దూరం ఉంటుంది ? ఖచ్చితంగా 28 కిలోమీటర్లు. అంటే … అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తే అరగంట పడుతుంది. సీఎం లాంటి వీఐపీలు కాన్వాయ్ కు దారిస్తారు.. ఎక్కడా అడ్డం రాకుండా చూసుకుంటారు కాబట్టి ఇరవై నిమిషాల్లో వెళ్లిపోతారు. కానీ ఈ కొద్ది దూరానికి సీఎం జగన్ హెలికాఫ్టర్ వాడేస్తున్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా మూడో విడత రైతులకు రూ. రెండు వేలు జమ చేసేందుకు మీట నొక్కేందుకు తెనాలి నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేశారు. మంగళవారం అక్కడ సభకు హాజరు కానున్నారు.
కామెడీ ఏమిటంటే.. ఈ రెండు వేలు కేంద్ర నిధులు. అవి ఒక రోజు ముందే అంటే… సోమవారమే రైతుల అకౌంట్లలో జమ చేశారు. అర్హులైన రైతుల ఖాతాల్లో అవి పడిపోయాయి. అర్హులైనా ఆ డబ్బులు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా సరే జగన్ మీట నొక్కుతారు. దాని కోసం తెనాలి వెళ్తున్నారు. మళ్లీ హెలికాఫ్టర్… ఫుల్ పేజీలు.. హాఫ్ పేజీల యాడ్స్ అన్నీ కామనే. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉంది. ఉద్యోగులకు జీతాలు నెలాఖరు వరకూ ఇస్తున్నారు. ఎవరికీ బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలోనూ జగన్ రాచబోగాలకు ఏ మాత్రం లోటు రానీయడం లేదు.
గతంలో టైం సేవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రులు హెలికాఫ్టర్లు వాడేవారు. ఈ మూల నుంచి ఆ మూలకు ఉంటే హెలికాఫ్టర్లు వాడేవారు. కానీ సీఎం జగన్ మాత్రం ఇరవై కిలోమీటర్ల దూరానికి హెలికాఫ్టర్లు వాడేస్తున్నారు. నిజానికి హెలికాఫ్టర్ గాల్లో ఎగరడానికి క్లియరెన్స్ వచ్చి.. ఎగిరి.. మళ్లీ ల్యాండయి… హెలిఫ్యాడ్ నుంచి సభా వేదిక వద్దకు వెళ్లడానికే ఎక్కువ సమయం పడుతుంది. కాన్వాయ్ లో వెళ్తే చాలా సమయం అదా అవుతుంది. సమయం ఎక్కువైనా సరే హెలికాఫ్టర్ లో వెళ్తేనే దర్జా అనుకుంటున్నారు సీఎం . ఎంతైనా ప్రజాధనమేగా ?