కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో బీజేపీ రాష్ట్ర మినీ కోర్ కమిటీ కానుంది. అత్యవసరంగా ఢిల్లీకి రావాలని వీరికి పిలుపు వచ్చింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, అర్వింద్ తో పాటు మరో పది మంది నేతలు ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం అమిత్ షా వీరితో సమావేశం అవుతున్నారు. మంగళవారమే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ప్లాన్ చేశారు. మినీ కోర్ కమిటీలోని కీలక నేతలు కూడా కొన్ని సభలకు చీఫ్ గెస్టులుగా హాజరుకావాల్సి ఉంది.
కానీ, సోమవారం ఉదయమే అమిత్ షా ఆఫీసు నుంచి రాష్ట్ర నేతలకు ఢిల్లీ రావాలని పిలుపు వచ్చింది. కార్నర్ మీటింగ్స్ సభలు ఉన్నాయని చెప్పినా.. వాటిని వేరే నేతలకు అప్పగించాలని హైకమాండ్ చెప్పడంతో వేరే వారికి ఆ బాధ్యతలు అప్పగించారు. మీటింగ్ ఎజెండా ఏమిటనే విషయాన్ని రాష్ట్ర నేతలకు చెప్పకపోయినా.. అత్యవసరమైన ఎజెండాపైనే మీటింగ్ ఉంటుందనే సంకేతాలను ఢిల్లీ పెద్దలు ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని బీజేపీ పెద్దలకు సమాచారం వచ్చి ఉంటుందని అందుకే పిలిపించారని కొంత మంది భావిస్తున్నారు. ఉన్న పళంగా ఎన్నికలకు సిద్ధమయ్యేలా అమిత్ షా సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాములో వరుస అరెస్టులు జరుగుతున్నాయ.ి తర్వాత వంతు కవితేనన్న ప్రచారం జరుగుతోంది. ఒక వేళ కవితను సీబీఐ అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందన్న దానిపైనా … అమిత్ షా ఆరా తీసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అత్యవసర భేటీ అజెండా ఏమిటి.. తదుపరి కార్యాచరణ ఏమిటన్నదానిపై సాయంత్రానికి క్లారిటీ వస్తుందని బీజేపీ నేతలంటున్నారు.